మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది. కొందరు కొత్త సంవత్సరంలో విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ నేపధ్యంలో ఆ ప్రదేశంలో ఎన్నో ప్రత్యేకతలు ఉండాలని కోరుకుంటారు. అలాంటి ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అత్యంత సురక్షిత దేశం
ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి భద్రత గురించి మనకు ముందుగా తెలియదు. అటువంటి పరిస్థితిలో భద్రత కలిగిన ప్రాంతాల గురించి మనం అన్వేషిస్తాం. ఇటీవల అమెరికన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీ బెర్క్‌షైర్ హాత్వే ట్రావెల్ తాజాగా ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి పేరు ఐస్లాండ్. ఈ దేశం 2025లో సందర్శించడానికి అత్యంత సురక్షితమైన ప్రదేశంగా ఆ కంపెనీ తెలిపింది.
పలు అంశాలపై సర్వే
ఈ జాబితాను సిద్ధం చేసేందుకు బెర్క్‌షైర్ హాత్వే ట్రావెల్ కంపెనీ ఒక సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో, క్రైమ్ రేట్, మహిళల భద్రత, ఎల్‌జీబీటీఐక్యూ ప్లస్, ప్రయాణికుల అనుభవం, రవాణా వ్యవస్థ, ఆరోగ్య సేవలు తదితర వివరాలను ప్రయాణికుల నుంచి సేకరించారు. ఈ సంస్థ 2016 నుంచి ఈ విధమైన సర్వేలు నిర్వహిస్తోంది.
పోలీసులు తుపాకులు పట్టుకోరు
గత సంవత్సరం ఈ జాబితాలో ఐస్లాండ్ తొమ్మిదో స్థానంలో ఉంది. అయితే 2024లో ప్రయాణికులు అందించిన వివరాలు, రేటింగ్ ఆ దేశాన్ని అగ్రస్థానానికి తీసుకువెళ్లాయి. ఈ ద్వీపం చాలా చిన్నది. నాలుగు లక్షల జనాభా మాత్రమే ఇక్కడ ఉంటోంది. ఇక్కడ హింసాత్మక నేరాల రేటు చాలా తక్కువ. పోలీసులు తుపాకులను పట్టరు. ఐస్లాండ్‌కు సైన్యం కూడా లేదు. ఐస్లాండ్ 2024లో అనేక అగ్నిపర్వత విస్ఫోటనాలను చవిచూసింది. ఇది పర్యాటకుల తాకిడిపై ఏ మాత్రం ప్రభావం చూపకపోవడం విశేషం
ఐస్లాండ్‌లో ఏమిటి ఫేమస్?
ఐస్లాండ్ రాజధాని రెక్జావిక్ పర్యాటకులలో నిత్యం అత్యంత రద్దీగా ఉంటుంది. నగరం నడిబొడ్డున ఉన్న అతిపెద్ద చర్చి పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. ఐస్లాండ్‌లో వివిధ ఆకారాలు, పరిమాణాలు కలిగిన మంచుకొండలను దగ్గరి నుంచి చూడవచ్చు. దేశంలో పర్యాటకులను ఆకర్షించేలా అనేక ప్రదేశాలు ఉన్నాయి.
సురక్షిత దేశాల జాబితాలో..
ఈ జాబితాలో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో ఉంది. ఈ దేశాన్ని పర్యాటకులకు సురక్షితం దేశంగా భావిస్తారు. నేరాల రేటు కూడా ఇక్కడ చాలా తక్కువ. పర్యాటకులు ఈ దేశ రవాణా భద్రతను ఉత్తమంగా రేట్ చేశారు. సురక్షితమైన దేశాల జాబితాలో కెనడా మూడవ స్థానంలో నిలిచింది. ఈ దేశం మహిళలకు, ఎల్‌జీబీటీక్యూఐఏ ప్లస్ వర్గాలకు సురక్షితమైనదని, నేరాల రేటు తక్కువగా ఉందని సర్వే పేర్కొంది. నయాగరా జలపాతం, బాన్ఫ్ నేషనల్ పార్క్ కెనడాలో ప్రత్యేక పర్యాటక ఆకర్షణలు.
ఈ జాబితాలో తర్వాతి స్థానంలో ఐర్లాండ్ ఉంది. ఈ దేశంలో నేరాల రేటు చాలా తక్కువ. ఈ దేశంలో 50 లక్షల జనాభా ఉంది. ఈ దేశం ప్రకృతి అందాలకు నిలయంగా నిలిచింది. ఈ జాబితాలో స్విట్జర్లాండ్ ఐదో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్, జర్మనీ, నార్వే, జపాన్, డెన్మార్క్, పోర్చుగల్, స్పెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్, నెదర్లాండ్స్, స్వీడన్ తదితర దేశాలు ఈ జాబితాలో తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: నేడు సుబ్రహ్మణ్య షష్టి: ఈ 10 ఆలయాల్లో విశేష పూజలు
Comments
Please login to add a commentAdd a comment