ఇజ్రాయెల్ హెచ్చరికలతో ఉత్తర గాజాను వీడి మరో ప్రాంతంలో వంట చేసుకుంటున్న పాలస్తీనా మహిళలు; గాజాలో దాడుల్లో ధ్వంసమైన భవనం నుంచి చెలరేగిన మంటలు
రఫా/టెల్ అవీవ్: ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. ప్రధానంగా గాజా సిటీ శివారు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. పదుల సంఖ్యలో హమాస్ మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. పూర్తిస్థాయి భూతల యుద్ధం త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తున్నామని, అది సుదీర్ఘకాలం, సంక్లిష్టంగా ఉండబోతోందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ చెప్పారు.
గాజాలో హమాస్ మిలిటెంట్లు నిర్మించుకున్న సొరంగాల వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. గల్లాంట్ శుక్రవారం విదేశీ జర్నలిస్టులతో మాట్లాడారు. భారీ స్థాయిలో సైనిక బలగాలతో భూతల యుద్ధం ప్రారంభిస్తామని అన్నారు. వారికి వెన్నుదన్నుగా వైమానిక దళం కూడా ఉంటుందని చెప్పారు. తమ జవాన్లు గురువారం ఉత్తర గాజాపై భూతల దాడి చేసి, క్షేమంగా తిరిగి వచ్చారని వెల్లడించారు. శుక్రవారం కూడా ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యిందన్నారు.
9 వేలు దాటిన మృతుల సంఖ్య
మూడు వారాల క్రితం ప్రారంభమైన ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 9 వేలు దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 7,300 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో 3,000 మంది మైనర్లు, 1,500 మందికిపైగా మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య గతంలో జరిగిన నాలుగు యుద్ధాల్లో దాదాపు 4,000 మంది మృతిచెందారు. ఈ నెల 7న మొదలైన యుద్ధంలో మృతుల సంఖ్య ఇప్పటికే 7,300 దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో వెస్ట్‌బ్యాంక్‌లో మృతిచెందినవారి సంఖ్య 110కు చేరుకుంది.
హమాస్ మిలిటెంట్ల దాడుల్లో ఇజ్రాయెల్ భూభాగంలో 1,400 మందికిపైగా మృత్యువాతపడ్డారు. హమాస్ వద్ద 229 మంది బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని విడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా నలుగురు బందీలను మిలిటెంట్లు విడుదల చేశారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో ఇప్పటిదకా 200కిపైగా పాఠశాలలు ధ్వంసమయ్యాయని ‘యునెస్కో’ ప్రకటించింది. అంటే గాజాలోని మొత్తం స్కూళ్లలో 40 శాతం స్కూళ్లు ధ్వంసమైనట్లు తెలియజేసింది.
ఇంధనాన్ని అనుమతించేది లేదు
సరిపడా ఆహారం, నీరు, నిత్యావసరాలు, ఔషధాలు లేక గాజాలో ప్రజల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనం నరకయాతన అనుభవిస్తున్నారు. ఆసుపత్రుల్లో రోగులు, క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంక్యుబేటర్లు పనిచేయక శిశువులు కన్నుమూస్తున్నారు. ఈజిప్టు ప్రభుత్వం పరిమితంగా ఆహారం, నిత్యావసరాలను ఈజిప్టు నుంచి గాజాలోకి అనుమతిస్తోంది.
మరోవైపు గాజాకు పెట్రోల్, డీజిల్ సరఫరాను అనుమతించబోమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గల్లాంట్ మరోసారి తేలి్చచెప్పారు. ఇంధనం మిలిటెంట్ల చేతుల్లోకి చేరితే దురి్వనియోగమయ్యే అవకాశం ఉందన్నారు. మిలిటెంట్లు జనరేటర్లతో సొరంగాల్లోకి గాలిని పంపిస్తుంటారని, ఇందుకోసం ఇంధనం వాడాల్సి ఉంటుందన్నారు. ‘‘హమాస్ మిలిటెంట్లకు గాలి కావాలంటే ఇంధనం కావాలి, ఇంధనం కావాలంటే మేము కావాలి’’ అని గల్లాంట్ వ్యాఖ్యానించారు.
బందీల్లో 30 మంది పిల్లలు!
ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు దొరికినవారిని దొరికినట్లు ఊచకోత కోశారు. చాలామందిని నిలబెట్టి కాల్చేశారు. వెనక్కి వెళ్లిపోతూ 229 మందిని బందీలుగా బలవంతంగా లాక్కెళ్లారు. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. బందీలను గాజాలోని గుర్తుతెలియని ప్రాంతంలో దాచినట్లు తెలుస్తోంది.
బందీల్లో 30 మంది చిన్నపిల్లలు ఉన్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ధారణకు వచి్చంది. తమ పిల్లలను విడిపించాలంటూ వారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. మూడేళ్లు, నాలుగేళ్ల వయసున్న చిన్నారులను కూడా మిలిటెంట్లు అపహరించడం గమనార్హం. వారి క్షేమ సమాచారాలు తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. జెనీవా తీర్మానం ప్రకారం.. సాధారణ పౌరులను బందీలుగా మార్చడం ముమ్మాటికీ యుద్ధ నేరమే అవుతుంది.
సిరియాలో అమెరికా దాడులు
వాషింగ్టన్: తూర్పు సిరియాలో ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్ సేనల స్థావరాలే లక్ష్యంగా అమెరికా ఫైటర్ జెట్లు శుక్రవారం ఉదయం నిప్పుల వర్షం కురిపించాయి. రెండు ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించినట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. గతవారం సిరియాలోని తమ సైనిక స్థావరాలపై ఇరాన్ అనుకూల మిలిటెంట్లు క్షిపణులు, డ్రోన్లతో దాడి చేశారని, వాటికి ప్రతిస్పందనగానే తాము వైమానిక దాడులు చేసినట్లు వెల్లడించింది. ఒకవైపు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం కొనసాగుతుండగా, మరోవైపు అమెరికా సైన్యం సిరియాలో ఇరాన్ అనుకూల శక్తులపై విరుచుకుపడడం ఆందోళన కలిగిస్తోంది.
అయితే, సిరియాలో దాడికి ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణతో ఏమాత్రం సంబంధం లేదని అమెరికా తేలి్చచెప్పింది. తమ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలతోనే తూర్పు సిరియాలో ఇరాన్ సాయుధ దళాలపై దాడి చేశామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ పేర్కొన్నారు. అమెరికా దళాలపై దాడులను సహించబోమని పేర్కొన్నారు. అక్టోబర్ 17 నుంచి ఇరాక్, సిరియాలోని తమ సైనిక స్థావరాలపై, జవాన్లపై కనీసం 19 దాడులు జరిగాయని పెంటగాన్ ఆరోపించింది. ఈ దాడులకు బాధ్యులైనవారిపై ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ పశ్చిమాసియాలో భారీ సంఖ్యలో సైనిక బలగాలను మోహరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment