ఒట్టావా/న్యూఢిల్లీ: ‘‘శాంతియుత నిరసన హక్కులకు కెనడా ఎల్లప్పుడూ మద్దతునిస్తుంది’’ అంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత రైతులకు సంఘీభావం తెలిపారు. ‘‘ఇండియాలో రైతు నిరసనల గురించి వస్తున్న వార్తలు వింటున్నాం. అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎలా ఉన్నారోనన్న విషయం మనల్ని కలవరపెడుతుంది. మీ అందరి మనసుల్లో చెలరేగుతున్న కల్లోలం గురించి నేను అర్థం చేసుకోగలను. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి వాళ్లకు మనం అండగా ఉన్నాం’’ అంటూ సిక్కు సోదరులకు అభయమిచ్చారు. గురునానక్ 551వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఆన్‌లైన్ ఈవెంట్‌లో జస్టిన్ ట్రూడో ప్రసంగించారు.
ఈ మేరకు.. ‘‘ఒక సమస్య గురించి చర్చించడం అన్నింటి కంటే ముఖ్యమైనది. ఈ విషయం గురించి భారత అధికారులతో మాట్లాడి మన ఆందోళనను తెలియజేద్దాం. మనమంతా కలిసికట్టుగా ఉండాల్సిన సమయం ఇది’’ అని ట్రూడో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వరల్డ్ సిక్కు ఆర్గనైజేషన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు, రైతు సంఘాల నేతలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.(చదవండి: చర్చలకు రండి; కేంద్ర సర్కారు ఆహ్వానం)
వేలాది మంది పంజాబ్, హరియాణా నుంచి ఢిల్లీకి పయనమై కేంద్రానికి తమ గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. అనేక పరిణామాల అనంతరం ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. రైతులను చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు మంగళవారం వారితో మట్లాడి సమస్యలకు పరిష్కారం కనుగొంటామని కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. కాగా దేశ రాజధానిలో భారత రైతులు చేస్తున్న నిరసనపై స్పందించిన తొలి విదేశీ నేత ట్రూడోనే కావడం గమనార్హం. (చదవండి: ఆస్తుల వెల్లడిలో రిషి సునక్‌పై పలు అనుమానాలు)
Comments
Please login to add a commentAdd a comment