Russia Ukraine War: Zelensky Urges UNSC To Punish Russia And Reform Itself - Sakshi
Sakshi News home page

Russia Ukraine War: వీటోను రష్యా మారణహోమానికి లైసెన్స్‌గా వాడుతోంది

Apr 6 2022 7:29 AM | Updated on Apr 6 2022 11:13 AM

No More Russia Veto Ukraine Prez Zelensky Demands UNSC - Sakshi

ఉక్రెయిన్‌లో మారణ హోమానికి రష్యాకు వీటో అనే పవర్‌ లైసెన్స్‌గా మారిందని జెలెన్‌స్కీ ఆరోపించాడు.

న్యూయార్క్‌: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ ఆవేశపూరితంగా ప్రసంగించాడు.  రష్యా సైన్యం తమ దేశంలో అత్యంత హేయమైన యుద్ధనేరాలకు పాల్పడిందని ఆరోపించిన జెలెన్‌స్కీ.. తక్షణమే స్పందించాలంటూ భద్రతా మండలిని కోరాడు. 

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఉద్దేశించి మంగళవారం రాత్రి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. బుచాలో రక్తమోడుతూ, కాలి బుగ్గిగా మారి కనిపించిన శవాల కుప్పలకు సంబంధించిన వీడియోను ప్రదర్శించాడు జెలెన్‌స్కీ. తక్షణమే స్పందించాలని లేదంటే మొత్తంగా మిమ్మల్ని మీరు పూర్తిగా రద్దు చేసుకోండి అంటూ ఐరాస భద్రతా మండలిని ఉద్దేశించి ఆవేశంగా ప్రసంగించాడు జెలెన్‌స్కీ. 



ఐసిస్‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో రష్యా బలగాలు ఉక్రెయిన్‌లో మారణహోమానికి పాల్పడ్డాయన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు.. రష్యాను వెలివేయాలని డిమాండ్‌ చేశాడు. తద్వారా వీటో అధికారాన్ని రష్యాకు లేకుండా చేయాలని కోరాడు. ఒకవేళ ప్రత్యామ్నాయం, ఇతర దారులు లేకుంటే గనుక.. మొత్తంగా భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితిలనే రద్దు చేసుకోవాలంటూ కోరాడు జెలెన్‌స్కీ.  

రష్యా బలగాలు మారణకాండకు పాల్పడ్డాయన్న  దీనిపై విచారణ జరపాలని, ఇంతటి ఘోరాలకు ఆదేశాలిచ్చిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ‘బుచాలో రష్యా దళాలు చేయని నేరం లేదు. ప్రతి పౌరున్నీ వెతికి వెతికి చంపాయి. ఉగ్రవాద సంస్థ కంటే కిరాతకంగా వ్యవహరించింది. సాక్షాత్తూ భద్రతా మండలిలో వీటో అధికారమున్న శాశ్వత సభ్య దేశం కావడం గర్హనీయం. వీటో అధికారాన్ని మమ్మల్ని చంపేందుకు హక్కుగా, ఒక లైసెన్స్‌గా రష్యా వాడుకుంటోంది. ప్రపంచ భద్రతకే ఇదో సవాలు. ఇలాంటి వాటిని అరికట్టేలా తక్షణం ఐరాస వ్యవస్థను సంస్కరించాలి’ అని వాదించారు. 

ఆధారాలు ఏవీ?: రష్యా
ఇదిలా ఉండగా.. ఐరాసలో మాస్కో అంబాసిడర్‌ వసెలీ నెబెంజియా మాత్రం ఉక్రెయిన్‌ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నేరుగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ.. రష్యా బలగాలు దమనకాండను పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవు, ఉంటే సమర్పించండి. ఇదంతా ఉక్రెయిన్‌ ఆడుతున్న నాటకం అంటూ ప్రత్యారోపణలు చేశారు. మరోవైపు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ భద్రతా మండలిలో తాజా పరిణామాలపై స్పందించారు.  ఇప్పటికే ఈ యుద్ధం వల్ల 74 దేశాలు, బిలియన్‌న్నర మంది సంక్షోభంలోకి కూరుకుపోయారని హెచ్చరిస్తూ.. తక్షణమే ఈ యుద్ధం ఆగాలంటూ పిలుపు ఇచ్చారు.

సంబంధిత వార్త: ఉక్రెయిన్‌లో ఊచకోత! లెక్కలు ఏం చెప్తున్నాయంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement