ప్రాగ్: ఖలిస్తానీ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నిన కేసులో భారత్‌కు చెందిన నిందితుడు నిఖిల్‌గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు ప్రాగ్ హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తనను అమెరికాకు అప్పగించవచ్చని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని గుప్తా వేసిన అప్పీల్‌ను హై కోర్టు తోసిపుచ్చింది.
పన్నూ హత్యకు కుట్ర పన్నాడని నిఖిల్ గుప్తాపై అమెరికన్ పోలీసులు అభియోగం మోపారు. గతేడాది జూన్‌లో గుప్తాను చెక్ రిపబ్లిక్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే హై కోర్టు ఓకే అన్నంత మాత్రాన గుప్తాను అమెరికాకు అప్పగించడం సులువు కాదని తెలుస్తోంది.
పన్నూ కేసులో గుప్తాను అమెరికాకు అప్పగించవచ్చని ప్రాగ్ హై కోర్టు ఇచ్చిన తీర్పును చెక్ రిపబ్లిక్ న్యాయ శాఖ మంత్రి ఆమోదించాల్సి ఉంటుంది. మంత్రి ఎప్పటిలోగా ఆమోదించాలన్నదానిపై కాల పరిమితి ఏమీ లేదు.
ఒకవేళ న్యాయ శాఖ మంత్రికి కోర్టు తీర్పుపై ఏమైనా సందేహాలుంటే ఆయన తిరిగి ఈ తీర్పును సమీక్షించాల్సిదిగా సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేసే అవకాశం ఉంది. ఈ తతంగం మొత్తం పూర్తయిన తర్వాతే గుప్తాను అమెరికాకు అప్పగిస్తారు. తీర్పును సుప్రీంకోర్టుకు రిఫర్ చేయాలని న్యాయ శాఖ మంత్రిని కోరతానని గుప్తా తరపు న్యాయవాది చెప్పడం గమనార్హం. ఖలిస్తానీ నేత పన్నూకు అమెరికాతో పాటు కెనడా పౌరసత్వం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment