బిల్లు 500.. టిప్పు 2 లక్షలు! | Restaurant in Cleveland Received 3000 Tip For 7 Dollar bill | Sakshi
Sakshi News home page

7 డాలర్ల బిల్లుకి 3,000 డాలర్లు టిప్పిచ్చిన కస్టమర్‌

Published Thu, Nov 26 2020 7:24 PM | Last Updated on Thu, Nov 26 2020 8:54 PM

Restaurant in Cleveland Received 3000 Tip For 7 Dollar bill - Sakshi

‘‘ఇది సాధారణ సంవత్సరమయ్యుంటే ఇది ఒక మంచి కథలా మిగిలిపోయేది. ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇది ఒక గొప్ప కథలా కనిపిస్తుంది’’

క్లీవ్‌లాండ్‌: ఓహియో రాష్ట్రం (అమెరికా) క్లీవ్‌లాండ్‌ నగరంలోని ఓ రెస్టరెంట్‌కు ఆదివారం ఒక కస్టమర్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. 7 డాలర్ల (దాదాపు 500 రూపాయలు) బిల్లుకి 3,000 డాలర్ల (సుమారు రూ. 2.21 లక్షలు) టిప్పు కలిపి మొత్తం 3,007 డాలర్లు చెల్లించాడు.

రెస్టరెంట్‌ యజమాని బ్రెండన్‌ రింగ్‌ ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ.. ‘‘ఓహియోలో కరోనా కేసులు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో రెస్టరెంట్‌ను స్వచ్ఛందంగా జనవరి వరకూ మూసివేయాలనుకున్నాం. చివరి రోజు కావడంతో ఆదివారం రెస్టరెంట్‌ కిటకిటలాడుతూ ఉంది. అంతలో అప్పుడప్పుడు మా దగ్గరికొచ్చే ఒక కస్టమర్‌ లోపలికొచ్చాడు. ఒక స్టెల్లా డ్రింక్‌ ఆర్డర్‌ చేశాడు. రెండు సిప్పులు తాగిన తర్వాత ‘చెక్‌’ ఇమ్మన్నాడు. దాన్ని తీసుకుని రింగ్‌ టేబుల్‌ వద్దకొచ్చిన అతను బిల్లుతో పాటు రింగ్‌కు డబ్బులిస్తూ ‘‘గుడ్‌లక్‌. మళ్లీ కలుద్దాం!’’ అని వెళ్లిపోయాడు. ఆ బిల్లుపై టిప్పు ముందు 300 గా కనబడింది. కళ్లజోడు పెట్టుకున్నాక గానీ అది 3,000 అని తెలియలేదు. వెంటనే బయటకు పరుగు తీసి అతన్ని కలిసాను. ‘‘ఏమైనా పొరబడ్డారా?’’ అని అడిగాను. అందుకతను ‘‘లేదు. తెలిసే ఇచ్చాను. దాన్ని స్టాఫ్‌ అందరికీ పంచండి. మెరీ క్రిస్‌మస్‌’’ అన్నాడు. ఈ విషయం చెప్తే జోక్‌ చేస్తున్నానని మొదట ఒక వెయిట్రెస్‌ నమ్మలేదు. ఆ రోజు నలుగురు డ్యూటీలో ఉన్నారు. తలా 750 డాలర్లు ఇచ్చాను’’ అని వివరించాడు.

అయితే తన పేరు బయటపెట్టొద్దని ఆ కస్టమర్‌ కోరాడని రింగ్‌ తెలిపాడు. ఈ సంఘటన పేపర్లో రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆ ‘అజ్ఞాత’ కస్టమర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని, తన సోదరి కూడా ఈ విషయాన్ని పేపర్లో చదివిందని ఉత్సాహంగా చెప్పాడు రింగ్‌. ‘‘ఇది సాధారణ సంవత్సరమయ్యుంటే ఇది ఒక మంచి కథలా మిగిలిపోయేది. ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇది ఒక గొప్ప కథలా కనిపిస్తుంది’’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement