ప్రతిఘటన ఆపి.. ఆయుధాలు పక్కనపెడితేనే చర్చలంటూ ప్రకటించిన రష్యా.. గంటల వ్యవధిలోనే మాట మార్చింది. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపొద్దంటూ స్వరం మార్చాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పూర్తిగా ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకునే వరకు వెనక్కి తగ్గొద్దంటూ సైన్యానికి కీలక సూచన చేశాడు. పనిలో పనిగా ఉక్రెయిన్ సైన్యానికి ఓ సలహా ఇస్తున్నాడు.
గురువారం ఉదయం నుంచి మొదలైన ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యలు.. శుక్రవారం కొనసాగాయి. అయితే మధ్యాహ్నం తర్వాతి పరిణామాలతో ఒక్కసారిగా సీన్ మారింది. ఉక్రెయిన్ ఆయుధాలు వీడితే చర్చలకు సిద్ధమని రష్యా.. ఈలోపే చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ఉక్రెయిన్ పరస్పర ప్రకటనలు చేసుకున్నాయి. చర్చల దిశగా ఇరు దేశాలు అడుగులు వేశాయని.. యుద్ధం ముగియొచ్చని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడి విజ్ఞప్తిని సైతం లెక్కచేయకుండా.. దాడులు ముమ్మరం చేయాలని పుతిన్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈయూ ఆంక్షలు, బంధువుల ఆస్తుల్ని సీజ్ చేయడం, అమెరికా సైబర్ దాడులు, నాటో దళాల కీలక సమావేశం.. ఒకదానివెంట ఒకటి వేగంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో పుతిన్ మనసు మార్చుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. శుక్రవారం ఓ టీవీ ఛానెల్‌లో ప్రసంగించిన పుతిన్, ప్రభుత్వాన్ని పడగొట్టాలంటూ ఉక్రెయిన్ సైన్యాన్ని కోరాడు.
#UPDATE Russian President Vladimir Putin on Friday called on the Ukrainian army to overthrow the country's leadership whom he described in a televised address as "terrorists" and "a gang of drug addicts and neo-Nazis" pic.twitter.com/eFTPYcoO5n
— AFP News Agency (@AFP) February 25, 2022
ప్రస్తుతం రాజధాని కీవ్ Kyiv పై రష్యా దళాలు విరుచుకుపడుతున్నాయి. యుద్ధ ట్యాంకర్లు నగరాన్ని చుట్టుముట్టగా.. గెరిల్లా దళాలతో రష్యా ఆర్మీ దాడులు నిర్వహిస్తోంది. భారీ శబ్ధాలతో పేలుళ్లు సంభవిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కీవ్ ఎయిర్‌పోర్ట్‌ను రష్యా దళాలు ఆక్రమించుకున్నట్లు సమాచారం. ఈ తరుణంలో ఉక్రెయిన్ బలగాలు సైతం ధీటుగానే పోరాడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థల కథనం. ఈ తరుణంలో నాటో దళాల ఎమర్జెన్సీ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment