వందల ఏళ్ల తర్వాత విస్ఫోటనం.. ఆమ్లెట్‌ వేసిన సైంటిస్టులు | Scientists Cook Hot Dogs And Egg On Molten Lava In Iceland | Sakshi
Sakshi News home page

వందల ఏళ్ల తర్వాత విస్ఫోటనం.. ఆమ్లెట్‌ వేసిన సైంటిస్టులు

Mar 25 2021 11:40 AM | Updated on Mar 25 2021 12:29 PM

Scientists Cook Hot Dogs And Egg On Molten Lava In Iceland - Sakshi

లావా మీద వంట చేస్తోన్న సైంటిస్టులు (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)

రేక్జావిక్: ఐస్‌ల్యాండ్ రాజధాని రేక్జావిక్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఫగ్రడాల్స్‌ఫాల్‌ పర్వతం సమీపంలో ఉన్న అగ్ని పర్వతం వారం రోజుల క్రితం విస్ఫోటనం చెందిన సంగతి తెలిసిందే. 900 వందల సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఈ ఏడాది బద్దలవ్వడంతో ఆ చుట్టు పక్కల ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ ప్రాంతంలో విస్ఫోటనం గురించి అధ్యయనం చేయడానికి ఐస్‌ల్యాండ్‌ చేరుకున్న శాస్త్రవేత్తలు పర్వత ప్రాంతంపై నుంచి లావా ప్రవహించే అరుదైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరో షాకింగ్‌ న్యూస్‌ ఏంటంటే వారు అక్కడ వంట కూడా చేశారు. మీరు చదివింది కరెక్టే.. శాస్త్రవేత్తలు అక్కడ వంట చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరలవుతున్నాయి.

న్యూస్‌ ఏజెన్సీ రాయిటర్స్‌ ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్‌ చేసింది. వందల ఏళ్ల తర్వాత ఈ అగ్ని పర్వతం విస్పోటనం చెందడంతో కొందరు శాస్త్రవేత్తలు దీని గురించి అధ్యయనం చేయడానికి ఐస్‌ల్యాండ్‌ చేరుకున్నారు. అగ్నిపర్వతం వద్దకు చేరుకున్న శాస్త్రవేత్తల బృందం ఈ విస్ఫోటనం గురించి అధ్యయనం చేయడమేకాక.. ఈ ఘటనలో వెలువడిన లావాను ఉపయోగించి ఏకంగా వంట చేశారు. 'ఐస్లాండ్ అగ్నిపర్వతం విస్పోటనం చెందడం వల్ల వెలువడిన లావా హాట్ డాగ్స్‌ను ఆస్వాదించడానికి అవకాశం కల్పిస్తుంది' అనే క్యాప్షన్‌తో యూట్యూబ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది ఇప్పటికే 58కే వ్యూస్‌ పొందింది.

విస్పోటనం వల్ల వెలువడిన వేడి వేడి లావాపై హాట్ డాగ్స్ వండటం, రేకు కాగితంపై శాండ్‌విచ్‌లను గ్రిల్ చేయడంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. మరొక బృందం ఈ లావా మీద పాన్‌ పెట్టి గుడ్లు పగలగొట్టి ఆమ్లెట్‌ వేయడమేకాక బేకన్ వండుతున్న మరొక వీడియోను యూరుకుర్ హిల్మార్సొన్మ్ యూట్యూబ్‌లో షేర్‌ చేశారు. ఫగ్రడాల్స్‌ఫాల్‌లో విస్ఫోటనం ప్రారంభమైన తరువాత గత శుక్రవారం రాత్రి ఎర్రటి మేఘం ఆకాశాన్ని కమ్మెసిందా అన్నట్లు అక్కడి పరిసరాలు మారిపోయాయి. ఇక విస్ఫోటనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

విస్ఫోటనంతో అగ్ని పర్వతం నుంచి బయటకు చిమ్ముతున్న ఎర్రని లావా ప్రవహాన్ని చూపించే ఒక డ్రోన్ ఫుటేజ్ ఇప్పటికే మిలియన్ల వ్యూస్‌ సంపాదించింది. విస్ఫోటనం జరగడానికి ముందు నాలుగు వారాల్లో ఈ ద్వీపకల్పంలో 40,000కు పైగా భూకంపాలు సంభవించాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో నో-ఫ్లై జోన్ ఆంక్షలు విధించారు. విస్ఫోటనం ప్రజలకు తక్షణ ప్రమాదం కలిగించలేదని అధికారులు వెల్లడించారు. 

చదవండి: 
వాల్కనో బీభత్సం : ఎగిసిపడిన లావా
సమ్మర్‌ లేని సంవత్సరం గురించి మీకు తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement