సిడ్నీ: ఆస్ట్రేలియాలో నివాసముంటున్న భారత వృద్హ జంట తమ వద్ద మరో భారతీయ వృద్ధురాలిని బానిసగా చేసుకుని చిత్రహింసలకు గురిచేసిన సంఘటనలో ఆస్ట్రేలియా న్యాయస్థానం వృద్ధ దంపతుల శిక్షా కాలాన్ని మరో రెండున్నరేళ్లకు పెంచుతూ సంచలనాత్మక తీర్పునిచ్చింది.
భారత్‌లోని తమిళనాడుకు చెందిన కుముదిని కణ్ణన్, కందసామి కణ్ణన్ జంట తమ వద్ద పని చేయడానికి ఒక భారతీయ మహిళను నియమించుకున్నారు. ఆమెకు ఇంటిపని వంటపని తోపాటు పిల్లలను చూసుకునే పని కూడా అప్పజెప్పి రోజుకు 23 గంటల పాటు పని చేయమని హింసించారు. ఒక పనిమనిషిలా కాకుండా మానవత్వం లేకుండా బానిసలా చూసినట్టు చూసి ఆమె అనారోగ్యానికి కారణమయ్యారు. పాపం ఆ మహిళ పోషకాహార లోపం, డయాబెటిస్, గాంగ్రీన్ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యింది.
ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసు శాఖ ఈ జంటపై బానిసల వ్యతిరేక చట్టం కింద కేసులు నమోదు చేసి వారిని 2021లో జైలుకు తరలించారు. ఈ కేసులో వాదోపవాదనలు పూర్తయిన తర్వాత ఆస్ట్రేలియా న్యాయస్థానం వృద్ధ జంటకు మరో రెండున్నరేళ్ళపాటు శిక్షను పొడిగించింది. 2016లో నమోదైన ఈ కేసులో సాక్షిని భయపెట్టేందుకు ప్రయత్నించిన కుముదిని కణ్ణన్ కు మొత్తం 8 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించగా అందులో నాలుగేళ్ల పాటు బెయిల్ నిరాకరిస్తున్నట్లు, అలాగే కందస్వామి కణ్ణన్ కు ఆరేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించి అందులో మూడేళ్లు బెయిల్ మంజూరు చేయడం కుదరదని తీర్పునిచ్చింది.
ఈ సందర్బంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఈ దంపతుల్లో కొంచెమైనా పశ్చాత్తాపం కనిపించడంలేదని.. వారిలో వీసమెత్తు మానవత్వం కూడా లేదని సాటి మనిషిని మనిషిగా కూడా చూడలేని కఠిన హృదయులని తెలిపారు. తప్పు చేసిన భావనే వారిలో కొరవడిందని చెబుతూ కఠిన శిక్షను అమలు చేయాల్సిందిగా కోరారు.
ఇది కూడా చదవండి: కుటుంబంపై హత్యాయత్నం చేసిన డాక్టర్.. కారులో తీసుకెళ్లి..
Comments
Please login to add a commentAdd a comment