వాషింగ్టన్: సామాజిక దిగ్గజ సంస్థ ట్విట్టర్‌కు సారథ్య బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమయ్యాడంటూ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు మరో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మస్క్ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ప్రపంచవ్యాప్తంగా 12.2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరిని ఉద్దేశిస్తూ మస్క్ ఆదివారం ఒక ట్వీట్‌చేశారు. ‘ ట్విట్టర్‌కు సీఈవోగా నేను తప్పుకోవాలా ?. ఈ పోలింగ్‌లో వచ్చే ఫలితాలకు అనుగుణంగా నడుచుకుంటా. మీ నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి.
మీరేం ఆశిస్తారో అదే మీకు దక్కుతుంది’ అని మస్క్ ఆదివారం ఒక ట్వీట్‌చేశారు. దీనిపై ట్విటర్ యూజర్లు వెంటనే భారీగా స్పందించారు. పోలైన ఓట్లలో 57.5 శాతం ఓట్లు మస్క్‌కు వ్యతిరేకంగా పడ్డాయి. మాకు మీరు అక్కర్లేదంటూ ‘యస్’ చెబుతూ ఓట్లు వేశారు. ఆదివారం సాయంత్రం మొదలైన ఈ ఓటింగ్ సోమవారం తెల్లవారుజామున ముగిసింది. మస్క్ పిలుపునకు స్పందనగా 1.7 కోట్లకుపైగా ఓట్లు పోల్ అయ్యాయని సీఎన్‌ఎన్ పేర్కొంది. ఓటింగ్ ఫలితంపై మస్క్ ఇంకా స్పందించలేదు. దాదాపు 44 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నాక మస్క్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై విమర్శలు కొనసాగుతుండటం తెల్సిందే.
భారీగా సిబ్బంది కోతలకు సిద్దమవడం, ఎక్కువ గంటలు చెమటోడ్చి పనిచేయాలని ఒత్తిడి తేవడం వంటి నిర్ణయాలతో మస్క్ పేరు చెబితేనే ట్విటర్ సిబ్బంది హడలెత్తిపోతున్నారు. ట్విటర్ విధానపర నిర్ణయాల్లో మార్పులపైనా ఆన్‌లైన్ ఓటింగ్ చేపడతానని మస్క్ ప్రకటించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్, మాస్టోడోన్, ట్రూత్ సోషల్, ట్రైబల్, నోస్టర్, పోస్ట్ వంటి ఇతర సోషల్‌మీడియా సంస్థల ఖాతాలకు వాడుతున్న అవే యూజర్‌ఐడీలతో కొనసాగుతున్న/అనుసంధానమైన ట్విట్టర్ ఖాతాలను తొలగిస్తామని ట్విటర్ తెలిపింది. ‘ఇన్‌స్ట్రాగామ్‌లో నన్ను ఫాలో అవ్వండి’, ‘ఫేస్‌బుక్‌లో నా ప్రొఫైల్ చెక్ చేయండి’ వంటి వాటికీ ట్విట్టర్ చెక్ పెట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment