
లండన్: తమ దేశాన్ని భద్రంగా ఉంచేందుకు ఎటువంటి చర్యకైనా వెనుకాడబోమని బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. అట్లాంటిక్ మిత్ర దేశాలతో నిత్యం టచ్‌లో ఉంటూ, రక్షణపరంగా సన్నద్ధతతో ఉన్నట్లు ఆయన తెలిపారు. సోమవారం ఆయన ఉత్తర ఇంగ్లండ్‌లోని ఓ ఆస్పత్రిని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన ఎటువంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నామని ప్రజలు గ్రహించాలని కోరారు. తమ దేశ గగనతలాన్ని కాపాడుకునేందుకు టైఫూన్ యుద్ధ విమానాలను అప్రమత్తంగా ఉంచామన్నారు. అనుమానిత చైనా నిఘా బెలూన్లను అమెరికా సైన్యం కూల్చివేయడం, యూకేకు కూడా బెలూన్ల బెడద ఉందన్న వార్తలపై రిషి పై విధంగా స్పందించారు.