లండన్: విద్యార్థులు పాఠశాలలకు డుమ్మా కొట్టాలంటే కాలు నొప్పి, కడుపు నొప్పి అని గతంలో చెప్పేవాళ్లు. కానీ ప్రస్తుత టెక్నాలజీ అందుబాటులో ఉండడం, దానికి తోడు వారి తెలివి తేటల కారణంగా.. కరోనా లేకపోయినా పాజిటివ్ వచ్చినట్టు రిపోర్ట్ సృష్టించి స్కూల్‌కు బంక్ కొట్టేస్తున్నారు. అసలు ఇలాంటివి ఎలా సాధ్యమౌతుందనే కదా మీ ప్రశ్న? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
యూకేలో పిల్లలు కాదు బాబోయ్ పిడుగులు..
యూకే లోని టీనేజర్స్ పాఠశాలలకు బంక్ కొట్టేందుకు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. కోవిడ్ పాజిటివ్ పరీక్షలను ఎలా నకిలీ చేయాలనే దానిపై విద్యార్థులు చిట్కాలను నేర్చుకోవడమే గాక ఆ చిట్కాని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఇతరులకు తెలియజేస్తున్నట్లు తెలిసింది. యుకే లోని ఐన్యూస్ నివేదిక ప్రకారం.. కోవిడ్ నిర్థారణ పరీక్ష జరిపే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్‌పై నిమ్మరసంతోపాటు ఇతర రకరకాల ద్రవాలను వేయడం వల్ల కరోనా పాజిటివ్ రిపోర్ట్ వస్తున్నట్లు స్టూడెంట్స్ తెలుసుకున్నారు. అంతేగాక ఇది ఎలా సాధ్యమో వివరిస్తూ టిక్‌టాక్‌లో వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. ఇక వెంటనే వీడియోలకు లక్షల సంఖ్యలో వ్యూస్‌తో పాటు లైక్స్ కూడా వస్తోందట. ఇదే పేరుతో టిక్‌టాక్‌లో ప్రత్యేకంగా ఓ అకౌంట్ ఉండగా.. దానికి 20 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.
సిట్రస్ ద్రవాల కాంబినేషన్లతో కరోనా పాజిటివ్ రిపోర్ట్
కోవిడ్ టెస్ట్ కిట్స్‌పై లెమన్ జ్యూస్, కోకా కోలా, వెనిగర్, సిట్రస్ ద్రవాల కాంబినేషన్లను వేయగా రిపోర్ట్ కాస్త పాజిటివ్‌గా చూపిస్తుండడం గమనార్హం. ఈ రిపోర్ట్‌నే చూపిస్తూ.. స్కూలుకు బంక్ కొడుతున్నారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లకుండా ఉండటానికి ఇదే ప్లాన్ అనుసరిస్తుండటంతో విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కొంత మంది విద్యార్థులు నిజంగానే కోవిడ్ బారిన పడుతున్నారని, అయితే కొందరు మాత్రమే ఇలా ఫేక్ రిపోర్టులు సృష్టిస్తున్నట్లు అసోసియేషన్ ఆఫ్ స్కూల్ అండ్ కాలేజీ లీడర్స్ ప్రధాన కార్యదర్శి జెఫ్ బార్టన్ తెలిపారు. ప్రస్తుతం స్టూడెంట్స్ ఫాలో అవుతున్న ఈ నకిలీ రిపోర్ట్ బాగోతంపై ఫుల్ ఫ్యాక్ట్ అనే ఓ నిజనిర్ధారణ సంస్థ ప్రయోగాలు చేసింది. వారి ప్రకారం.. సిట్రస్ స్వభావం ఉన్న పండ్లను ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్‌పై వేస్తే కరోనా ఫలితం పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు చూపిస్తోందని తెలపడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment