
ఐక్యరాజ్యసమితి: గాంధీజీ ఇచ్చిన శాంతి సందేశాన్ని ప్రపంచ సమాజం అందిపుచ్చుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకోవడం కాదు, మనందరి ఉమ్మడి శత్రువైన కరోనా మహమ్మారిపై మహాత్ముడి స్ఫూర్తితో కలిసికట్టుగా యుద్ధం సాగిద్దామని సూచించారు. కరోనాను ఓడించడమే మన లక్ష్యం కావాలని చెప్పారు. గాంధీజీ జయంతి రోజే అంతర్జాతీయ అహింసా దినం కావడం యాదృచ్ఛికం కాదని అన్నారు.
ఆయన పాటించిన అహింసా, శాంతియుత నిరసనలు, గౌరవం, సమానత్వం అనేవి మాటలకు అతీతమైనవని తెలిపారు. మానవాళి భవిష్యత్తుకు అవి చోదక శక్తులని ఉద్ఘాటించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులకు ఇవి చక్కటి పరిష్కార మార్గాలని వివరించారు. ఈ మేరకు అంతర్జాతీయ అహింసా దినం సందర్భంగా గుటెరస్ శనివారం ఒక సందేశం విడుదల చేశారు. ఘర్షణలు, వాతావరణ మార్పులు, పేదరికం, అసమానతలు, అపనమ్మకం, ప్రజల మధ్య విభజనలు ప్రపంచానికి పెద్ద సమస్యగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.