న్యూయార్క్/గాందీనగర్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్రముఖ హిందూ ఆలయంపై దాడి జరిగింది. దుండగులు ఆలయ గోడపై భారత వ్యతిరేక అభ్యంతరకర చిత్రాలతోపాటు ఖలిస్తాన్ అంటూ కలర్ స్ప్రే చేశారు. పోలీసులు ఈ ఘటనను విద్వేష నేరంగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. నెవార్క్‌లోని స్వామి నారాయణ్ మందిర్ హిందూ ఆలయంపై అభ్యంతరకర చిత్రాలు(గ్రాఫిటీ) ఉన్నాయంటూ శుక్రవారం ఉదయం తమకు ఆలయ నిర్వాహకుల నుంచి ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసు అధికారులు వాటిని పరిశీలించారు. గ్రాఫిటీని రెచ్చగొట్టే చర్యగా ఆలయ పెద్దలు పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు. కావాలనే ఎవరో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని చెప్పారు. విద్వేష నేరంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నామన్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ తదితరాలతో ఆధారాలను సేకరిస్తున్నామని చెప్పారు.
ఈ ఘటనను అమెరికా విదేశాంగ శాఖ, శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత్ కాన్సులేట్ కార్యాలయం తీవ్రంగా ఖండించాయి. గతంలోనూ భారత దౌత్య కార్యాలయాలపై ఇలాంటి దాడులు జరిగాయి. జూలైలో శాన్‌ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ కార్యాలయంపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. అమెరికా, కెనడాలపౌరసత్వమున్న ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూపై హత్యాయత్నం వెనుక భారత ప్రమేయముందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
ఉపేక్షించరాదు: జై శంకర్
ఈ ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ వెలుపల ఉగ్రవాదం, వేర్పాటువాదాలను ఉపేక్షించరాదని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment