US presidential elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో ఉత్కంఠ నానాటికీ పెరిగిపోతోంది. ఎన్నికలకు మరో నెల రోజుల సమయమే మిగిలి ఉంది. నవంబర్ 5న జరిగే ఎన్నికలపై ప్రపంచ దేశాలన్నీ అమితాసక్తి చూపుతున్నాయి. కాబోయే అగ్రరాజ్యాధిపతి ఎవరు? అనే ప్రశ్న అందరి మదిని తొలచివేస్తోంది. రకరకాల సర్వేలు, అంచనాలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అమెరికాకు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు వస్తారా? లేక డొనాల్డ్ ట్రంప్ మరోసారి రాజ్యమేలుతారా? అనే ప్రశ్నకు సమాధానం రావాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే. ఇప్పుడున్న పరిణామాలను బట్టి చూస్తే అధ్యక్ష రేసులో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కంటే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, భారతీయ అమెరికన్ కమలా హారిస్ ముందంజలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ ఏడాది జూలై నెలాఖరులో కమలా హారిస్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. పోటీ నుంచి జో బైడెన్ తప్పుకోవడంతో హారిస్‌కు మార్గం సుగమమైంది. జూలై నెలాఖరు నుంచి ఇప్పటిదాకా వివిధ ముఖ్యమైన సర్వేల్లో నేషనల్ పోలింగ్ సగటును పరిగణనలోకి తీసుకుంటే ట్రంప్ కంటే హారిస్‌కు విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. కమలా హారిస్‌కు 49 శాతం, ట్రంప్‌నకు 46 శాతం ప్రజాదరణ కనిపిస్తోంది. ఇరువురు నేతల మధ్య వ్యత్యాసం స్పల్పంగానే ఉంది. మరో నెల రోజుల్లో ప్రజాభిప్రాయంలో మార్పు వచ్చే అవకాశం లేకపోలేదు.
– సాక్షి, నేషనల్ డెస్క్
👉 ట్రంప్, హారిస్ మధ్య సెప్టెంబర్ 10న కీలకమైన డిబేట్ జరిగింది. ఈ డిబేట్‌లో ట్రంప్‌పై హారిస్ పైచేయి సాధించారు. ఆ రోజు ఆమె ప్రజాదరణ 2.5 పర్సంటేజీ పాయింట్లు పెరగా, మరో వారం తర్వాత 3.3 పాయింట్లు పెరిగింది. ట్రంప్ పట్ల ప్రజాదరణ గణనీయంగా తగ్గిపోయింది.
👉 ఎన్నికల్లో ఎవరెక్కువ ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే వారిదే విజయం. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలున్నాయి. ఒక్కో రాష్ట్రంలోని జనాభాను బట్టి ఆ రాష్ట్రానికి ఎలక్టోరల్ ఓట్లు కేటాయించారు.
👉మొత్తం ఎలక్టోరల్ ఓట్లు 538. విజయానికి కావాల్సింది 270.
👉 దేశంలో 50 రాష్ట్రాలు ఉన్నప్పటికీ అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించేవి మాత్రం కొన్నే ఉన్నాయి. వీటినే స్వింగ్ స్టేట్స్ అంటున్నారు. ఇక్కడ ఎవరు పాగా వేస్తే వారిదే అధికారం.
👉 మొత్తం 7 స్వింగ్ స్టేట్స్ ఉన్నాయి. అవి నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, నెవడా, జార్జియా, అరిజోనా, విస్కాన్సిన్, మిషిగాన్.
👉 ఇందులో నార్త్ కరోలినా, జార్జియా, అరిజోనాలో ట్రంప్ వైపు మొగ్గు కనిపిస్తోంది. మిగిలిన రాష్ట్రాల్లో కమలా హారిస్‌కు జనం జేజేలు పలుకున్నారు.
👉 ఇద్దరి మధ్య ఈ ఏడు రాష్ట్రాల్లో హోరాహోరీ పోటీ తథ్యమని చెప్పక తప్పదు.
చదవండి: కమలా హారిస్‌కు అండాదండా ఆమే!
👉స్వింగ్ రాష్ట్రాల్లో ఇరువురు నేతల నడుమ ప్రజాదరణలో వ్యత్యాసం 2 శాతం లోపే ఉండడంగమనార్హం. ఈ స్వల్ప వ్యత్యాసం నెల రోజుల్లో తారుమారు కావడం పెద్ద విశేషం కాదు.
👉అందుకే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ఎన్నికల పరిశీలకులు కచి్చతంగా అంచనా వేయలేకపోతున్నారు.
👉 మిషిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో డెమొక్రటిక్ పార్టీకి గట్టి పట్టుంది. కానీ, 2016లో అక్కడి ప్రజలు ట్రంప్ వైపు మొగ్గు చూపడంతో ఆయన సునాయాసంగా గెలిచారు.
👉2020లో మిషిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు ఆదరణ లభించింది. ఈసారి కూడా ఈ మూడు రాష్ట్రాల్లో డెమొక్రటిక్ అభ్యర్థి అయిన కమలా హారిస్ పట్ల ఆదరణ కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment