వాషింగ్టన్: తన ఆరోగ్యంపై వ్యక్తమవుతున్న ఆందోళనలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (81) కొట్టిపారేశారు. అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని దేవుడు తప్ప తననెవరూ ఒప్పించలేరని ఏబీసీ ఛానల్ ఇంటర్వ్యూలో అన్నారు. గత వారం రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలో బైడెన్ పదేపదే తడబటడం, ఆగి ఆగి మాట్లాడటంతో ఆయన మానసిక సంతులతపై డెమొక్రాట్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. బైడెన్ వైదొలగాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సర్వేల్లోనూ ఆయనకు ప్రజాదరణ పడిపోయింది. విరాళాలు ఇచ్చే దాతలు కూడా బైడెన్ తప్పుకుంటేనే తమ ఆర్థిక సహకారం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఒత్తిళ్లు పెరుగుతున్నా బైడెన్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. ప్రపంచాన్ని నడుపుతున్నానని, అధ్యక్షుడిగా ఉండటానికి తనకంటే మరెవరికీ యోగ్యత లేదన్నారు. మెదడు పనితీరుపై పరీక్ష చేయించుకొని ఫలితాలను ప్రజల ముందు పెడతారా అని ప్రశ్నించగా తాను రోజూ పరీక్ష ఎదుర్కొంటున్నానని బదులిచ్చారు.
మూడున్నరేళ్ల పాలనలో తాను ఎన్నో విజయాలు సాధించాననీ, అవి ట్రంప్‌తో గంటన్నర పాటు జరిపిన చర్చ వల్ల వమ్ము కావన్నారు. కొవిడ్ నుంచి అమెరికాను గట్టెక్కించి ప్రపంచంలోనే అత్యంత బలీయ ఆర్థిక వ్యవస్థగా నిలిపానని బైడెన్ తెలిపారు. తన ముదిమి వయసు గురించి చాలా చర్చ జరుగుతోందనీ, కోటిన్నర కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి తన వయసు అడ్డురాలేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment