మానసిక స్థితిపై ట్రంప్ ఆరోపణలు
వాషింగ్టన్: వృద్ధాప్యం, మతిమరుపు, తడబాటు సమస్యలతో సతమతమవుతూ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్‌తో కమలా హారిస్‌ను పోలుస్తూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. జార్జియా రాష్ట్రంలో బుధవారం జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రచార సభలో కార్యకర్తలనుద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ‘‘ఉపాధ్యక్షురాలు హారిస్‌ను చూసి ప్రపంచమే నవ్వుతోంది. ఎందుకో తెలుసా?. ఆమె అధ్యక్షురాలు కాబోయే ఛాన్సుందని తెల్సి నమ్మశక్యంకాక నవ్వుతున్నారు. ఇక ఆలోచనా శక్తి గురించి మాట్లాడితే ఈమెకు బైడెన్‌ను మించిన సమస్యలున్నాయి. అధిక ధరలు, గందరగోళ పాలనకు మనం తెరదించబోతున్నాం. కమల, అసమర్థ బైడెన్ కారణంగానే ఈ దుస్థితి దాపురించింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల కారణంగా మనకు ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్నాం’’అని అన్నారు.
సొంత డబ్బా కొట్టుకున్న ట్రంప్
హంగేరి ప్రధాని విక్టర్ అర్బాన్ గురించి ట్రంప్ మాట్లాడుతూ పనిలోపనిగా ట్రంప్ సొంత గొప్పలు చెప్పుకున్నారు. ‘‘విక్టర్ సమర్థవంతమైన నేత. విదేశీయులు ఎవరినీ తన దేశంలోకి రానివ్వడు. ప్రపంచంలో ఎందుకు ఇన్ని సమస్యలు?. మధ్యప్రాశ్చ్యంలో యుద్ధాలెందు జరుగుతున్నాయి. మూడో ప్రపంచయుద్ధం దిశగా రష్యా ఎందుకు పయనిస్తోందని విక్టర్‌ను అంతా అడిగితే ఆయన ఒక్కటే సులువైన పరిష్కారం చెప్పారు. ట్రంప్ దేశాధ్యక్ష పీఠంపై లేకపోవడం వల్లే. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నపుడు అంతా అతడిని చూసి భయపడ్డారు. చైనా, రష్యా.. అందరికీ భయమే. నేను అధికారంలో ఉన్నప్పుడు ఉక్రెయిన్‌లోకి రష్యా అడుగుపెట్టలేకపోయింది. నేను దిగిపోగానే ఉక్రెయిన్ గడ్డపై రష్యా దురాక్రమణ జెండా ఎగరేసింది. ఇక హారిస్ నాలుగేళ్లు అధ్యక్ష పీఠంపై కూర్చుంటే అమెరికాలో పరిశ్రమలు లేకుండా చేస్తుంది. దేశాన్ని నాశనం చేస్తుంది. అప్పుడు మన ప్రజాస్వామ్యం మనుగడలో ఉండదు. మన పని అయిపోతుంది. డెమొక్రాట్ల విధాన నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయి’’అని ఆరోపించారు.
ఇరాన్ నుంచి హత్యాయత్నం ముప్పు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ నుంచి ప్రాణహాని పొంచి ఉందని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. నిఘా వర్గాలు ఈ మేరకు తమకు సమాచారం అందించాయని ట్రంప్ ప్రచార బృందం తాజాగా ప్రకటించింది. వివరాలను ట్రంప్ ప్రచార విభాగ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చియంగ్ వెల్లడించారు. ‘‘అమెరికాలో అస్థిరత, గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా మిమ్మల్ని హత్య చేయడానికి ఇరాన్ కుట్ర పన్నుతోందని మంగళవారం ఉదయం భేటీ సందర్భంగా ట్రంప్‌కు జాతీయ నిఘా విభాగ డైరెక్టర్ వివరించారు. నిరంతరం సమన్వయంతో హత్య కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ట్రంప్‌ను కాపాడేందుకు అన్ని నిఘా, భద్రతా సంస్థలు పనిచేస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు, అవాంఛనీయ ఘటనలు లేకుండా స్వేచ్ఛగా దేశంలో ఎన్నికలు జరిపేందుకు సంస్థలు కృషిచేస్తున్నాయి’’అని స్టీవెన్ అన్నారు. జూలై 13న పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ పట్టణంలో సభలో ఒక ఆగంతకుడు ట్రంప్‌పైకి బుల్లెట్ల వర్షం కురిపించగా ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవి సమీపంగా దూసుకుపోవడం, వెనక కూర్చున్న ఒక వ్యక్తి మరణించడం తెల్సిందే. వెస్ట్ పామ్‌బీచ్ క్లబ్‌లో గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్‌ను చంపేందుకు రౌత్ అనే వ్యక్తి ప్రయత్నించడం తెల్సిందే.
హారిస్ ప్రచార కార్యాలయంపై కాల్పులు
వాషింగ్టన్: డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ప్రచార కార్యాలయంపై దాడి జరిగింది. అరిజోనాలో ఫీనిక్స్ శివార్లలో ఉన్న కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు పెల్లెట్ గన్‌తో కిటికీలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగింది. దాంతో కార్యాలయ తలుపుకు, కిటికీలకు రంధ్రాలు పడ్డాయి. ‘‘ఆ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేరు. దాంతో ఎవరికీ ఏ హానీ జరగలేదు’’అని పోలీసు లు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యాలయంపై ఈ నెలలోనే ఇది రెండో దాడి. సెప్టెంబర్ 16న కూడా ఇలాగే పెలెట్ గన్‌తో కాల్పులు జరిగాయి. దాంతో ప్రచార కార్యాలయంతో పాటు పరిసర ప్రాంతాలకు భద్రత పెంచారు. హారిస్ శుక్రవారం అరిజోనాలో మెక్సికో సరిహద్దును సందర్శించనున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. ఈ ముప్పును తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అరిజోనా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షుడు యోలాండా బెజరానో చెప్పారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఇప్పటికే రెండుసార్లు హత్యాయత్నం జరగడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment