
వాషింగ్టన్: భారత్ వంటి దేశాల నుంచి నిపుణులైన సిబ్బందిని నియమించుకోవడాన్ని పూర్తిగా ఆపేయాలంటూ మాగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) వేదిక మళ్లీ డిమాండ్ చేస్తున్న వేళ.. భారతీయ అమెరికన్ వ్యాపార వేత్త, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన వివేక్ రామస్వామి చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. అమెరికా అధ్యక్షుడిగా మరికొద్ది రోజుల్లో పగ్గాలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ భారతీయ అమెరికన్ వెంచర్ కేపిటలిస్ట్ శ్రీరాం కృష్ణన్‌ను కృత్రిమ మేథ సీనియర్ విధాన సలహాదారుగా ఇటీవల నియమించడం తెలిసిందే. ఈ నియామకంపై మాగా వేదిక విమర్శలు గుప్పిస్తోంది.
ఇలాంటి చర్యలు అమెరికా ఫస్ట్ లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తాయని అంటోంది. ఇమిగ్రేషన్ విధానాల వల్లే అమెరికన్లకు అవకాశాల్లేకుండా పోతున్నాయని మరి కొందరు వాదిస్తున్నారు. అయితే, వివేక్ రామస్వామి మరో కోణంలో చేస్తున్న వాదించారు. అసలు సమస్య ఇమిగ్రేషన్ విధానాల్లో లేదని, అమెరికా సంస్కృతిలో పిల్లల పెంపకంలో లోపమే కారణమంటూ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. అమెరికన్ యువతలో సహజంగానే నైపుణ్యం ఉందని, అయితే దానిని పెంపొందించడంలో వ్యవస్థాగతంగా విఫలమైందన్నారు.
గణిత మేధావులు, ఉన్నత విద్యావంతులను వదిలేసి అలంకార పదవుల్లో ఉన్న వారిని పొగుడుతుండటమనే సంస్కృతే ఇందుకు కారణమన్నారు. అదే సమయంలో, వలసదారుల కుటుంబాలు తమ పిల్లలను విద్యారంగంలో నిష్ణాతులుగా మార్చి, క్రమశిక్షణతో పెంచుతున్నాయని తెలిపారు. సామాజిక కార్యక్రమాలు, టీవీ వీక్షణం వంటివాటిపైనా ఆంక్షలు పెడుతుంటాయన్నారు. ఫలితంగా ఈ కుటుంబాల నుంచి నాయకులు తయారవడం మామూలేనన్నారు. ఈ వ్యాఖ్యలపై మాగా వేదిక భగ్గుమంది. వలసదారులకు, హెచ్–1బీ వీసాదారులకు అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ వివేక్ రామస్వామిపై
ఎదురుదాడికి దిగింది.
Comments
Please login to add a commentAdd a comment