బ్యాంకాక్: నడిచే ఎస్కలేటర్ లో పొరపాటున కాలు పడి ఇరుక్కోవడంతో 57 ఏళ్ల మహిళ మోకాలి పైభాగం వరకు కాలును తొలగించిన సంఘటన థాయ్ లాండ్లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. దీంతో పర్యాటక కేంద్రమైన బ్యాంకాక్ ఎయిర్ పోర్టులో సౌకర్యాలపై అనుమానాలు కమ్ముకుని, ఇకపై బ్యాంకాక్ పర్యటన అంటే పర్యాటకులు ఆలోచించే పరిస్థితి నెలకొంది.
డాన్ ముయాంగ్ ఎయిర్ పోర్టు డైరెక్టర్ కారంత్ తనకుల్జీరపత్ తెలిపిన వివరాల ప్రకారం నఖోన్ సి తమ్మారత్ వెళ్తోన్న ఒక మహిళ నడిచే ఎస్కలేటర్ మీద వెళ్తుండగా ఉన్నట్టుండి ఆమె కాలు ఎస్కలేటర్ లోపల ఇరుక్కుపోయింది. చాలాసేపు నొప్పితో విలవిల్లాడిపోయిన ఆ మహిళకు విముక్తి కలిగించడానికి విశ్వప్రయత్నాలు చేశామని అన్నారు.
ఇరుక్కున్న కాలిని విడిపించేందుకు చాలాసేపు శ్రమించినా ప్రయోజనం లేకపోయింది. చివరి ప్రయత్నంలో ఆమె కాలును మోకాలి పైభాగం వరకు తొలగించి అనంతరం దగ్గర్లోని బుమ్రుంగ్రాండ్ అంతర్జాతీయ హాస్పిటల్ కు తరలించామని తెలిపారు కారంత్. ప్రమాదానికి గల కారణం ఏమిటన్న కోణంలో దర్యాప్తు జరుగుతోందని మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
మా వలన ఆ మహిళకు జరిగిన నష్టానికి నా సానుభూతి తెలియజేస్తున్నానని.. జరిగిన తప్పిదానికి మేము పూర్తి బాధ్యత వహిస్తామని, ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు తోపాటు ఆమెకు ఎలాంటి పరిహారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు కారంత్.
బాధితురాలి కుమారుడు మాట్లాడుతూ.. మా అమ్మ పైకి ధైర్యంగానే ఉన్నప్పటికీ కాలు తీసేయడంతో ఆమె గుండె బద్దలైందని ఒకే కాలితో జీవితాంతం ఎలాగన్న ఆలోచన తనను లోలోపలే తొలిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇది కూడా చదవండి: నాహేల్ మృతి.. కంటిమీద కునుకులేని ఫ్రాన్స్..! వీడియో బయటకు
Comments
Please login to add a commentAdd a comment