టెక్‌ సెంటర్‌గా కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

టెక్‌ సెంటర్‌గా కరీంనగర్‌

Published Fri, Jan 31 2025 2:09 AM | Last Updated on Fri, Jan 31 2025 2:09 AM

టెక్‌ సెంటర్‌గా కరీంనగర్‌

టెక్‌ సెంటర్‌గా కరీంనగర్‌

కరీంనగర్‌కార్పొరేషన్‌: రానున్న రోజుల్లో సాంకేతిక కేంద్రంగా కరీంనగర్‌ అభివృద్ధి చెందుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కరీంనగర్‌తో పాటు, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ, పరిశ్రమల విస్తరణకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గురువారం నగరంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో నూతన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టెక్‌జెనీని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, కొత్త ఐటీ కంపెనీలు, పరిశ్రమలతో ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఇంజనీరింగ్‌ చదివినవారు ఎంతోమంది జిల్లాలో ఉన్నారని, వారికి ఐటీ కంపెనీల వల్ల ఉపాధి లభిస్తుందన్నారు. మంత్రి ప్రభాకర్‌ మాట్లాడుతూ, ఉపాధి అవకాశాల కోసం జిల్లాయువత ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా, కంపెనీలు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామన్నారు. పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పించేందుకు దావోస్‌ వెళ్లి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తే కొంతమంది విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఆర్‌టీఏ సభ్యుడు పడాల రాహుల్‌, అల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌రెడ్డి, అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ గడ్డం విలాస్‌రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, మెండి చంద్రశేఖర్‌, ఆకారపు భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సాంకేతిక విప్లవంలో భాగస్వాములు కావాలి

సాంకేతిక విప్లవంలో తెలంగాణవాసులు భాగస్వాములు కావాలని మంత్రి శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. తక్కువ పెట్టుబడితో కృత్రిమ మేధస్సు(ఏఐ)ను రూపొందించొచ్చని డీప్‌సీక్‌ రుజువు చేసిందన్నారు. ప్రపంచంలోనే మన దేశం, అందులో తెలంగాణలో మేధోసంపత్తి అధికమన్నారు. డీప్‌సీక్‌ తరహాలో ఏఐని రూపొందించేందుకు ముందుకురావాలని, వారికి ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. దావోస్‌ ఒప్పందాలపై విపక్షాల విమర్శలను ఆయన కొట్టిపారేశారు. గతేడాది తాము కుదుర్చుకున్న 18 ఒప్పందాల్లో 17 వివిధ స్థాయిలో ఉన్నాయని, అందులో 10 సగం పనులు పూర్తయ్యాయన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వందశాతం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను పోటీచేయనని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఏఐసీసీకి చెప్పారని, రెండురోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement