మల్యాల(చొప్పదండి): అప్పుల బాధతో ఈనెల 22న దుబాయ్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మల్యాల మండల కేంద్రానికి బోగసాయి (28) మృతదేహం గురువారం స్వగ్రామానికి చేరింది. ఆయన శవాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోధించారు. మృతుడి తండ్రి 15ఏళ్ల క్రితం మృతిచెందారు. తల్లి రెండేళ్ల క్రితం చనిపోయింది. మృతుడికి ఇద్దరు అక్కలు ఉన్నారు. సాయి అంత్యక్రియలకు స్థానికులు వి రాళాలు అందించారు. వడ్డెపల్లి శశాంక్ రూ.10వేలు, స్థానికులు రూ.50వేలు అందించారు.
ఎమ్మెల్యే పరామర్శ
బోగ సాయి కుటుంబసభ్యులను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు. రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
చికిత్స పొందుతూ విద్యార్థి మృతి
ధర్మపురి: చదువుకోవాలని తండ్రి మందలించగా మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఈనెల 18న క్రిమిసంహారక మందు తాగాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. ఎస్సై ఉదయ్‌కుమార్ కథనం ప్రకారం .. మండలంలోని రాజారం గ్రామానికి చెందిన సునర్కాని మల్లేశ్, స్వరూప దంపతులకు రెండోకుమారుడు సందీప్ (14) ధర్మపురిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. బడికి సరిగా వెళ్లకపోవడంతో తండ్రి మందలించాడు. మనస్తాపానికి గురైన సందీప్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగాడు. అతడిని బంధువులు కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. సందీప్ తల్లి స్వరూప గతంలో ఆత్మహత్య చేసుకుంది. మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య
మల్లాపూర్: అప్పులబాధతో మనస్తాపం చెందిన ఓ యువకుడు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సిరిపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మహ్మద్ ఖలీల్ పాషా (36) నాలుగేళ్లుగా ఉపాధి కోసం అప్పు చేసి గల్ఫ్ దేశాలకు వెళ్లి వస్తున్నాడు. ఇటీవలే వచ్చిన ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో బుధవారం గ్రామశివారులోని ఎల్లమ్మగుడి సమీపంలో పురుగుల మందు తాగి కుటుంబసభ్యులకు ఫోన్ చేశాడు. వారు అతడిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. మృతుడి భార్య రేష్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment