కంది కొనుగోళ్లలో ఉన్న నిబంధనలు పంట సాగు చేసిన రైతులకు సమస్యలుగా మారుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా లక్ష క్వింటాళ్లు కొనుగోలు చేసే విధంగా మార్క్‌ఫెడ్‌కు అనుమతులు అందాయి. ఇది రైతులకు ఊరట కలిగించే అంశం. కానీ ఎకరాలకు 3.31 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. నీటి లభ్యతతోపాటు పంటకు పోషకాలు అందించడంతో ఎకరాకు 5 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. దీంతో మార్క్‌ఫెడ్ నిబంధనల మేరకు ఎకరాకు 3.31 క్వింటాళ్లు కొనుగోళ్లు చేస్తే దిగుబడి ఎక్కువగా వచ్చిన రైతులు మిగిలిన ధాన్యం ఎక్కడ విక్రయించాలనే అయోమయ పరిస్థితి నెలకొంది. దీనికితోడు ఆన్‌లైన్‌లో నమోదైన ధాన్యమే కొనుగోలు చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ లెక్కన అధికారుల లెక్కకు, సాగు చేసిన దానికి 10 వేల ఎకరాలు తేడా ఉంది. దీంతో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోని రైతులు కేంద్రాల్లో విక్రయించుకోనే అవకాశం లేకుండా పోతుంది. స్థానిక వ్యవసాయ అధికారుల ధ్రువీకరణతో కొనుగోళ్లు జరిగేవి. కానీ ప్రస్తుతం స్థానిక వ్యవసాయ అధికారి ధ్రువీకరణతోపాటు రైతు సమగ్ర సర్వే ద్వారా ఆన్‌లైన్‌లో నమోదైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయనున్నారు. దీంతో రైతులకు పంట పండించి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోలేకపోయిన వారికి బహిరంగ మార్కెట్‌లోనే విక్రయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నాణ్యత విషయంలో రాజీపడకుండా కొనుగోలు చేస్తామని, నాణ్యత లేకపోతే వెనక్కి పంపిస్తామని చెబుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కంది కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర లభిస్తుందా లేదా అనే సందేహాలు రైతుల్లో ఉత్పన్నం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment