సప్లిమెంటరీకి సర్వం సిద్ధం | Sakshi
Sakshi News home page

సప్లిమెంటరీకి సర్వం సిద్ధం

Published Fri, May 24 2024 12:55 PM

సప్లి

నేటి నుంచి టెన్త్‌, ఇంటర్‌

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

31 వరకూ ఇంటర్‌

వచ్చే నెల 3 వరకూ

పదో తరగతి పరీక్షలు

ఏర్పాట్లు పూర్తి చేసిన

అధికార యంత్రాంగం

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ రెగ్యులర్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31 వరకూ ఇంటర్‌, వచ్చే నెల మూడో తేదీ వరకూ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ నెలలో రెగ్యులర్‌ పరీక్షల ఫలితాలు వెల్లడించిన రోజునే ప్రభుత్వం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని కూడా రెగ్యులర్‌ విద్యార్థులుగానే పరిగణించనున్నారు.

టెన్త్‌కు 7,915 మంది దరఖాస్తు

జిల్లాలో ఈ ఏడాది మార్చి 18 నుంచి జరిగిన పదో తరగతి పరీక్షలకు 27,671 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 22,993 మంది ఉత్తీర్ణత సాధించారు. గతంలో ఫెయిలైన విద్యార్థులతో పాటు అన్ని సబ్జెక్టులకూ కలిపి ఈసారి 7,915 మంది సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 29 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులను ఆయా పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకూ అనుమతిస్తారు. ఇప్పటికే విద్యార్థుల హాల్‌ టికెట్లను ఆయా పాఠశాలలకు పరీక్షల విభాగం పంపించింది. ఆ హాల్‌ టికెట్లను ఆయా ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్‌ చేసి విద్యార్థులకు ఇచ్చే పనిలో ఉన్నారు. సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు గత ఏడాది మాదిరిగానే ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు ప్రతి రోజూ ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులకు మెళకువలను నేర్పించారు.

ఇంటర్‌కు 22,379 మంది..

ఈ ఏడాది మార్చి 1 నుంచి 20వ తేదీ వరకూ ఇంటర్‌ రెగ్యులర్‌ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను గత నెల 12న విడుదల చేశారు. వీటిల్లో ఫెయిలైన విద్యార్థులకు, బెటర్‌మెంట్‌కు దరఖాస్తు చేసిన వారికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫస్టియర్‌ జనరల్‌ 14,600, ఒకేషనల్‌ 906, సెకండియర్‌ జనరల్‌ 6,293, ఒకేషనల్‌ 580 కలిపి జిల్లావ్యాప్తంగా మొత్తం 22,379 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 16 ప్రభుత్వ, 2 ఎయిడెడ్‌, 11 ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్‌ పరీక్షలు రెండు సెషన్లుగా నిర్వహిస్తున్నారు. ఫస్టియర్‌ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, సెకండియర్‌ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ జరగనున్నాయి. విద్యార్థులు వారికి కేటాయించిన కేంద్రానికి అరగంట ముందుగా చేరుకోవాల్సి ఉంటుంది.

విస్తృతంగా ఏర్పాట్లు

టెన్త్‌, ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకుని వెళ్లకూడదు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించి, పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారులతో 4 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్‌ సెంటర్లను పరీక్ష సమయంలో మూసివేయాలని ఇప్పటికే అధికారులు ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో తాగునీరు, ప్రథమ చికిత్స అందుబాటులో ఉంచుతున్నారు. పరీక్ష సమయంలో అంతరాయాలు లేని విద్యుత్‌ సరఫరా ఉండేలా ఏపీ ఈపీడీసీఎల్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరేందుకు వీలుగా ఆయా రూట్లలో బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఇప్పటికే కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు.

ఏర్పాట్లు పూర్తి చేశాం

విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నాం. ముఖ్యంగా మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాం. అన్ని శాఖలనూ సమన్వయం చేసుకుంటూ పరీక్షలు విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం.

– జీజీకే నూకరాజు, జిల్లా ఇంటర్మీడియెట్‌

విద్యాశాఖాధికారి, కాకినాడ

ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి లేదు

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాం. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలూ తీసుకుని రాకూడదు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు నాలుగు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను నియమించాం. రెగ్యులర్‌ పరీక్షల మాదిరిగానే సప్లిమెంటరీ పరీక్షలు కూడా పకడ్బందీగా నిర్వహిస్తున్నాం.

– పిల్లి రమేష్‌, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ

సప్లిమెంటరీకి సర్వం సిద్ధం
1/2

సప్లిమెంటరీకి సర్వం సిద్ధం

సప్లిమెంటరీకి సర్వం సిద్ధం
2/2

సప్లిమెంటరీకి సర్వం సిద్ధం

Advertisement
 
Advertisement
 
Advertisement