కామారెడ్డి: ఉరి వేసుకుని ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గురువారం ఉదయం వెలుగు చూసింది. రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన ఏలేటి నరేష్ రెడ్డి (30) ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
అతనికి భార్య వర్షిణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాలుగేళ్ల క్రితం సొంత ఇల్లు కట్టుకుని కామారెడ్డిలోని హౌసింగ్‌బెర్డు కాలనీలో స్థిరపడ్డాడు. ప్రస్తుతం అతడు జిల్లా పోలీసు కార్యాలయంలో పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో అందరూ కలిసి భోజనం చేసి పడుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఇంట్లోని మరో గదిలోకి వెళ్లి కొక్కానికి వైర్‌తో ఉరి వేసుకున్నాడు. యేడాదిగా అతడు కడుపునొప్పితో బాధ పడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఎన్ని ఆస్పత్రులు తిరిగినా కడుపు నొప్పి తగ్గకపోవడంతోనే జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. కుటుంబ సమస్యలు కావచ్చని మరికొందరు భావిస్తున్నారు. కడుపునొప్పి కారణంగా తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌హెచ్‌ఓ నరేష్ తెలిపారు.
నాడు కూతురు మృతి.. నేడు కొడుకు ఆత్మహత్య
చెట్టంత ఎదిగిన కొడుకు ఉరేసుకుని చనిపోయాడని తెలిసిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తుంటే అందరూ కంటతడిపెట్టారు. దేవుడు మాకెందుకీ శిక్ష విధించాడని రోధించారు. రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఏలేటి నరేశ్‌రెడ్డి (30) బుధవారం రాత్రి కామారెడ్డిలోని ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు.
సొంతూళ్లో ఉంటున్న తల్లిదండ్రులు మహిపాల్‌రెడ్డి, రాధ కొడుకు మరణవార్త విని కుప్పకూలిపోయారు. వృద్ధాప్యంలో తమను సాకుతాడని కలలుగన్న తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. 2005లో వారి కూతురు జయంతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కబడ్డీ క్రీడాకారిణి అయిన ఆమె జాతీయస్థాయి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. పెళ్లయిన కొంత కాలానికే ఆమె మృతి చెందింది. అప్పుడు ఎదిగిన కూతురు, ఇప్పుడు ఎదిగిన కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది.
అంత్యక్రియల్లో పాల్గొన్న ఉన్నతాధికారులు
రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఏలేటి నరేష్‌రెడ్డి(37) మృతిచెందగా ఆయన అంత్యక్రియల్లో ఓఎస్డీ ఎస్పీ అన్యోన్య, ఆర్‌ఐలు, ఎస్సైలు, రాజంపేట పోలీసు సిబ్బంది గురువారం మధ్యాహ్నం బస్వన్నపల్లికి చేరుకుని ఆయన మృతదేహానికి నివాళులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గోన్నారు.
Comments
Please login to add a commentAdd a comment