అయినా మారరు!
‘కనిపించే మూడు సింహాలు న్యాయానికీ నీతికీ ధర్మానికీ ప్రతిరూపాలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్’ అంటూ ‘పోలీస్ స్టోరీ’ సినిమాలో హీరో సాయికుమార్ చెప్పిన ఈ డైలాగ్ పోలీస్ శాఖ ఔన్నత్యాన్ని చాటింది. అయితే కొందరు అధికారులు డబ్బుపై కక్కుర్తితో శాఖకు మచ్చ తెస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తున్నా అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
పోలీస్ పోస్టింగుల్లో పొలిటికల్ ముద్ర పరిపాటిగా మారింది. అధికారంలో ఉన్న వారు తమకు అనుకూలురైన అధికారులకు పోస్టింగులు ఇప్పించుకుంటారు. అనువైన స్థానాల కోసం పోలీస్ అధికారులు సైతం నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం, ఎంతో కొంత మాట్లాడుకుని అనుకున్న పోస్టింగ్ సంపాదించుకోవడం సర్వసాధారణంగా మారింది. దీంతో పెట్టిన పెట్టుబడి నింపుకోవడానికి, అదనంగా నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికి పలువురు అడ్డదారులు తొక్కుతున్నారు. బరితెగిస్తున్న అధికారులు ప్రతి కేసులోనూ ఎంతోకొంత లాగే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసు అధికారులు బాహాటంగా డబ్బుల గురించి మాట్లాడుతున్నారు. డబ్బు యావలో ముందూ, వెనకా చూసుకోకుండా చేస్తున్న అతి వారిని ఇబ్బందుల్లోకి నెడుతోంది. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. అన్ని చోట్లా ఏసీబీ అధికారుల నంబర్లు దొరుకుతున్నాయి. అధికారి డబ్బుల కోసం ఇబ్బంది పెడితే చాలు.. ప్రజలు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి చిక్కుతుండడంతో పోలీసు శాఖ అప్రతిష్టపాలవుతోంది.
పర్యవేక్షణ పెరిగినా..
జిల్లాల విభజన తర్వాత అధికారుల పర్యవేక్షణ పెరిగింది. గతంలో జిల్లా అధికారులు ఠాణాలకు ఏడాదికో, రెండేళ్లకో వచ్చేవారు. చిన్న జిల్లాలు అయిన తర్వాత పరిధి తగ్గి అధికారులు ప్రతి ఠాణాను రెండు మూడు నెలలకోసారైనా చుట్టేస్తున్నారు. నెలనెలా జరిగే క్రైం మీటింగుల్లోనూ అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. అయినా కొందరు అదనపు డబ్బు కోసమే నౌకరీ చేస్తున్నట్టుగా తయారయ్యారు. జిల్లా ఏర్పడిన తరువాత పలువురు అధికారులు ఏసీబీకి చిక్కారు. నాలుగేళ్ల క్రితం కామారెడ్డి జిల్లా కేంద్రంలో క్రికెట్ బెట్టింగుల కేసులో డీఎస్పీ, సీఐ, ఎస్సైలు ఏసీబీ కేసులో అరెస్టయ్యారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో మరికొందరు ఏసీబీకి చిక్కారు. అప్పట్లో మంజీర నుంచి అక్రమంగా ఇసుక తరలింపు వ్యవహారంలోనూ పలువురు అధికారులపై ఆరోపణలు వచ్చాయి. గతేడాది నవంబర్ 14న లింగంపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్సై అరుణ్‌కుమార్‌తో పాటు స్టేషన్ రైటర్ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మరచిపోకముందే అదే ఠాణాలో చేరిన ఎస్సై సుధాకర్ బుధవారం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు దొరికారు.
పెరిగిన అవినీతి నిరోధక శాఖ దాడులు
రెండున్నర నెలల క్రితం
ఏసీబీకి చిక్కిన ఎస్సై, రైటర్
తాజాగా రెడ్ హ్యాండెడ్‌గా
పట్టుబడిన లింగంపేట ఎస్సై
Comments
Please login to add a commentAdd a comment