మోగిన ఎన్నికల నగారా!
పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. వచ్చేనెల 3న నోటిఫికేషన్ జారీ కానుంది. అదేనెల 27న పోలింగ్ నిర్వహిస్తారు. ఇప్పటికే ఎన్నికల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా షెడ్యూల్‌తోపాటే ఎలక్షన్ కోడ్ అమలులోకి రావడంతో నాలుగు పథకాల అమలుపై సందిగ్ధత నెలకొంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
మెదక్ –నిజామాబాద్ –ఆదిలాబాద్ –కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డిల పదవీకాలం మార్చి నెలలో పూర్తవనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. బుధవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. వచ్చే నెల 3న నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే రోజు నుంచి 10 వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 11న నామినేషన్ల పరిశీలన, 13 వరకు విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 3న ఓట్లను లెక్కించనున్నారు.
ఆ పథకాల పరిస్థితేమిటో?
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌తోపాటే ఎలక్షన్ కోడ్ అమలులోకి రావడంతో అధికారిక కార్యక్రమాలు నెల రోజుల పాటు నిలిచిపోనున్నాయి. కాగా ప్రభుత్వం రైతుభరోసా, ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పథకాలను గణతంత్ర దినోత్సవం రోజున లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామాల్లో నాలుగు పథకాలను అమలు చేశారు. అయితే ఎన్నికల కోడ్ వచ్చినందున మిగతా గ్రామాలలో ఆయా పథకాలు అమలు అవుతాయా? కోడ్ ఎత్తేసేంత వరకు ఆగిపోతాయా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment