వృద్ధాశ్రమం సందర్శన
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని క్యాసంపల్లి వద్దనున్న వృద్ధాశ్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి టి.నాగరాణి బుధవారం సందర్శించారు. వృద్ధులతో కాసేపు మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలనుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చన్నారు. చట్టాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు.
డిజిటల్ బస్సు యాత్ర ప్రారంభం
కామారెడ్డి టౌన్: తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన డిజిటల్ బస్సు యాత్రను బుధవారం జిల్లా కేంద్రంలో డీఈవో ఎస్.రాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సు యాత్ర ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఐటీ కంపెనీ ఉద్యోగులతో అవగాహన కల్పిస్తామని డీఈవో తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐటీ గ్లోబల్ సంస్థ చైర్మన్ సందీప్, మక్తల్, టీఐటీఏ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు.
రగ్బీ జిల్లా జట్ల ఎంపిక
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో బుధవారం రగ్బీ బాలబాలికల జిల్లా జట్లను ఎంపిక చేశారు. ఎంపిక పోటీలకు 150 మంది క్రీడాకారులు హాజరయ్యారని, ఇందులో ప్రతిభ చూపిన 30 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామని రగ్బీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నీలం రవి తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు వచ్చేనెల 1, 2, 3 తేదీలలో మంచిర్యాలలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు మనోజ్, రవీందర్‌సింగ్, నవీన్, దిలీప్, సంతోష్, శోభ తదితరులు పాల్గొన్నారు.
రేపు కబడ్డీ జిల్లా జట్టు..
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని లయోలా హైస్కూల్లో శుక్రవారం జిల్లా కబడ్డీ జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ విషయాన్ని కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగా వెంకటేశ్వర్‌గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బాణాల భాస్కర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 85 కిలోలలోపు బరువున్న వారు 93985 71110 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఎంపికై న క్రీడాకారులు వచ్చేనెల 4 నుంచి 7వ తేదీ వరకు ఆదిలాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
రేపు మున్సిపల్ అధికారులతో
ఎమ్మెల్యే సమావేశం
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపల్ అధికారులతో శుక్రవారం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సమావేశం కానున్నారు. ఈనెల 26న బల్దియా పాలకవర్గం పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శుక్రవారం బల్దియా అధికారులతో సమావేశమై పుర సమస్యలపై చర్చిస్తారని బీజేపీ నాయకులు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో పారిశుధ్య, వాటర్‌వర్క్స్, రెవెన్యూ, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగాల అధికారులతో వేర్వేరుగా సమావేశం నిర్వహించనున్నారని పేర్కొన్నారు.
ఆర్ఎంపీలపై కేసు నమోదు
బాన్సువాడ : పట్టణానికి చెందిన ముగ్గురు ఆర్ఎంపీలపై కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు. ఎలాంటి అర్హత లేకున్నా వైద్యం చేస్తున్నారంటూ వెంకట్‌రెడ్డి, సురేష్, ప్రకాష్‌లపై మెడికల్ కౌన్సిల్ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు. ఇటీవల బాన్సువాడలో మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. అర్హతలు లేకున్నా వైద్యం చేస్తున్నట్లు గుర్తించి ముగ్గురిపై ఫిర్యాదు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 11 మంది ఆర్ఎంపీలపై కేసులు నమోదు చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment