కరీంనగర్: విద్యావ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రైవేట్ దోపిడీ మితిమీరుతోంది. డొనేషన్లు, ఫీజులే కాదు.. పాఠ్యపుస్తకాలు, టైలు, బెల్ట్‌లు, బ్యాడ్జిలన్నీ తమవద్దే కొనాలని గిరి గీయడంతో తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. ప్రైవేట్ స్కూళ్లపై అధికారుల నియంత్రణ కొరవడడంతో ఇష్టారాజ్యం మారింది. జూన్ వచ్చిందంటే తల్లిదండ్రుల గుండెల్లో దడ మొదలవుతుంది. గతేడాది కంటే ఈసారి 10 నుంచి 30 శాతం వరకు ఫీజులను ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు పెంచడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు.
తోక పేర్లు, వసతుల పేరిట దోపిడీ
జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లు నయా దోపిడీకి శ్రీకారం చుట్టాయి. ఒక్కప్పుడు జిల్లా కేంద్రాలకే పరిమితమైన సాధారణ, కార్పొరేట్ విద్యాసంస్థలు నేడు పట్టణాలు, పల్లెల్లో సైతం పాగా వేశాయి. ఈ–స్మార్ట్, ఈ–గ్లోబల్, ఈ–టెక్నో తదితర అందమైన పేర్లను ముందుకు తగిలిస్తూ తల్లిదండ్రులను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కాగా పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెంచేందుకు ప్రైవేట్ యాజమాన్యాలు వారి వద్ద పనిచేస్తున్న ఉపాధ్యాయులనే రంగంలోకి దింపడంతో పాటు పీఆర్‌ఓలను నియమించుకొని అడ్మిషన్‌కు ఇంత ఇస్తామంటూ ఆశ చూపుతూ విద్యావ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. ఈ తతంగాన్ని అడ్డుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరించడంతో యాజమాన్యాల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది.
విద్యా హక్కు చట్టానికి తూట్లు
ప్రైవేటు స్కూళ్లు విద్యాహక్కు చట్టం అమలుకు తూట్లు పొడుస్తున్నాయి. చట్ట ప్రకారం బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా విద్య అందించాల్సి ఉన్నా... అలా చేయడం లేదు. ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం విద్యార్థులకు ఉచిత విద్య అమలయ్యేలా కృషి చేస్తామంటున్న విద్యాశాఖ అధికారులు స్పష్టమైన విధి విధానాలు లేక చేతులేత్తయడం వరకే పరిమితమవుతున్నారు. జిల్లాలో ప్రైవేటు యాజమాన్యాల కింద ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 698 పైగా ఉండగా వీటిలో ప్రస్తుతం 2లక్షల వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. చట్ట ప్రకారం వీరిలో నాలుగో వంతు మందికి ఉచిత విద్య అందించాలి. కానీ యాజమాన్యాలు బడుగు బలహీన వర్గాల నుంచి కూడా ఫీజులు వసూలు చేస్తున్నాయి.
సీట్ల భర్తీకి రిజర్వేషన్
ఒకటో తరగతిలో 25 శాతం సీట్లను రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయాలని చట్టం నిర్దేశించింది. అనాథలు, ఎయిడ్స్ బాధితులకు 5 శాతం, ఎస్సీలకు 10, గిరిజనులకు 4, బీసీలకు 6 శాతం సీట్లను కేటాయించాలి. కానీ వ్యాపార దృక్పథంతో పనిచేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు దీనిని పట్టించుకోవడం లేదు. చట్టప్రకారం సీట్ల భర్తీ జరిగితే బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు మంచి విద్య దొరుకుతుంది.
అధిక ఫీజు వసూలు చేస్తే చర్యలు
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆకర్షణీయమైన పేర్లతో తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం చట్టవిరుద్ధం. నిబంధనలు పాటించని విద్యాసంస్థల గుర్తింపును జీవో 1 ప్రకారం రద్దు చేస్తాం. ప్రతీ పాఠశాలలో ఫీజుల వివరాలు నోటీసుబోర్డుపై ప్రదర్శించాలి.
– సీహెచ్ జనార్దన్‌రావు, డీఈవో
తీరు మారాలి
ప్రైవేట్ విద్యాసంస్థల పట్ల విద్యాశాఖ తీరు మారాలి. ఫీజుల దోపిడీని అరికట్టాలి. విద్యాహక్కు చట్టాన్ని ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేయకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే. విద్యను వ్యాపారం చేస్తూ సంపన్నుల కొమ్ము కాస్తున్న సర్కార్ విద్యాహక్కు చట్టంపై స్పష్టమైన విధివిధానాలు ప్రకటించాలి.
– మచ్చ రమేశ్,
Comments
Please login to add a commentAdd a comment