కరీంనగర్: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అన్నదాతల ఆశలు ఫలించాయి. లక్షలోపు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా సదరు ప్రక్రియ నాలుగేళ్ల అనంతరం తుదిదశకు చేరుకోవడం గమనార్హం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రధానమైంది సాగురంగమే. ఉభయ గోదావరి జిల్లాలతో పోటీపడే ఉమ్మడి కరీంనగర్‌ది ప్రత్యేక ముద్ర. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, పసుపు, చెరకు పంటలకు ప్రసిద్ధి కాగా చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ.
ఈక్రమంలో బ్యాంకు రుణంతోనే ఏటా రెండు పంటలను సాగు చేస్తుంటారు. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తుండగా దిగుబడులు ఒక్కోసారి దిగదుడుపే. ఈ నేపఽథ్యంలో ప్రభుత్వం ప్రకటించే రుణమాఫీ ప్రకటనే రైతులకు ధైర్యాన్నిస్తుండగా మాఫీ అమలు ఆగుతూ సాగింది. 2018 డిసెంబర్ 11 వరకు రూ.లక్షలోపు రుణం తీసుకున్నవారికి రుణమాఫీ ప్రకటించగా ఉమ్మడి జిల్లాలో 3,49,474 మంది లబ్ధి చేకూరనుంది. రూ.1200 కోట్ల మేర రుణమాఫీ జరగనుంది.
ఆగుతూ సాగిన ప్రక్రియ
టీఆర్‌ఎస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించగా నాలు గు విడతలుగా మాఫీ చేస్తామని గతంలో ప్రకటించింది. రూ.25 వేలలోపు రుణం తీసుకున్న రైతులకు ఒకసారి, రూ.50 వేలలోపు మరోసారి, రూ.75 వేలు, రూ.లక్ష చివరిసారి ఇలా నాలుగు విడతలుగా మాఫీ ఇలా 2019లోనే సదరు ప్రక్రియ పూర్తికావాలి. కానీ.. కేవలం రూ.25 వేల లోపు రుణం తీసుకున్నవారికి మాత్రమే మొదటి విడత మాఫీ చేశారు.
ఆ త ర్వాత మిగతా ప్రక్రియ ఆగిపోయింది. ఓసారి సమాచారం సేకరించడం మళ్లీ అటకెక్కించడం చేశారు. మొదటి విడతలో కరీంనగర్ జిల్లాలో 15,200 మంది లబ్ధిపొందగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,663, పెద్దపల్లి జిల్లాలో 14,636, జగిత్యాల జిల్లాలో 27 వేల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది.
వడ్డీ డబ్బులు తిరిగొచ్చేనా?
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కర్శకులు రుణమాఫీ కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం నాలుగు విడతల్లో మాఫీ చేస్తుందని ప్రకటించడంతో చాలామంది రుణాలు తిరిగి చెల్లించలేదు. వడ్డీ డబ్బులు కడుతూ వచ్చారు. మొత్తంగా రూ.400ల కోట్ల వరకు వడ్డీ చెల్లించినట్లు సమాచారం. ధాన్యం డబ్బులు ఖాతాలో జమైతే చాలు బ్యాంకర్లు వాటిని రుణానికి మిత్తికింద జమచేశారు.
కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో 50 శాతానికి పైగా రైతులది ఇదే పరిస్థితి. 2019లోనే పూర్తిగా రుణమాఫీ జరగాల్సి ఉండగా నాలుగేళ్లుగా వడ్డీ డబ్బులు చెల్లించి రెన్యువల్ చేసుకున్నారు. ఈ క్రమంలో సదరు డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమచేయాలని డిమాండ్ చేస్తున్నారు.
లేకుంటే మాఫీ చేసినా పెద్దగా రైతులకు ఒరిగిందేమి లేదని అభిప్రాయపడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో 76,791 మందికి ఇంకా రుణమాఫీ కావాల్సి ఉండగా రాజన్న సిరిసిల్ల 57,210, పెద్దపల్లి 78,064, జగిత్యాల జిల్లాలో 76 వేల మంది రైతులు ఇప్పటికీ రెన్యువల్ కింద వడ్డీ చెల్లిస్తూ రుణాలు తీసుకుంటున్నారు.
రైతుబాంధవుడు సీఎం
దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా, రైతాంగ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కరోనా వంటి విపత్కర పరిస్థితులు, ఎప్‌ఆర్బీఎం పరిమితులు, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కేంద్ర అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయం పడిపోయినా తెలంగాణలో రైతుల కోసం కృషి చేస్తున్నారు.
నేడు రూ. 19 వేల కోట్ల భారాన్ని భరిస్తూ తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయం విప్లవాత్మకం. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్, విత్తనాలు, ఎరువులు, కాళేశ్వరం జలాలతో రాష్ట్రాన్ని ధాన్యగారంగా తీర్చిదిద్దారు. – గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment