పెట్రోల్‌ బంకుల్లో ఈ సేవలుండాల్సిందే..! లేదంటే.. | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంకుల్లో ఈ సేవలుండాల్సిందే..! లేదంటే..

Published Mon, Jan 8 2024 11:58 PM | Last Updated on Tue, Jan 9 2024 12:56 PM

- - Sakshi

కరీంనగర్‌: 'కరీంనగర్‌కు చెందిన శ్రీధర్‌ కమాన్‌కు సమీపంలోని ఓ పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌ పోయించుకునేందుకు వెళ్లాడు. పెట్రోల్‌ పోసుకుని, బైక్‌ టైర్‌లో గాలి నింపాలని అక్కడి సిబ్బందిని కోరగా.. ఇక్కడ అలాంటివేమీ ఉండవని, గాలి పంపు పనిచేయడం లేదని సమాధానం ఇచ్చారు. చాలాబంకుల్లో గాలి నింపేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు నగరంలో ఉన్నాయి. గాలే కాదు.. చాలా బంకుల్లో మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయాలు కానరావడం లేదు.'

పెట్రోల్‌ బంకుల్లో ఉచిత సేవలకు అనుచితంగా వ్యవహరిస్తున్నారా అయితే ఇది మీ కోసమే. బంకుల్లో టైర్లలో గాలి, తాగునీరు, మూత్రశాలలు, ఫోన్‌ సౌకర్యం తదితర సేవలు ఉచితం. వీటిపై అవగాహన లేకపోవడంతో డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలే పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే అదనపు వ్యయం భారంగా మారుతోంది. చిల్లరే కదా అనుకుంటే నెలకు రూ.కోట్లలోనే సామాన్యుల జేబుకు చిల్లు పడుతోంది.

మనం చెల్లించే డబ్బులే..

  • డీజిల్‌ అయినా పెట్రోలైనా లీటరుపై మనం పెట్రోలు బంక్‌కు 4 నుంచి 6 పైసలు కేవలం మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ కోసం చెల్లిస్తున్నాం. ప్రతీ బంకులో టాయిలెట్‌, మంచినీరు, ఎయిర్‌ ఫ్రీగా అందించాలి. ఇలా అందిస్తేనే పెట్రోల్‌ బంకు నిర్వహణకు అనుమతి దొరుకుతుంది.
  • చాలామంది ప్రయాణంలో ఉన్నవారు టాయిలెట్‌ అర్జంట్‌ అయినప్పుడు పబ్లిక్‌ టాయిలెట్స్‌ కోసమో.. నిర్మానుష్య ప్రదేశాల కోసమో వెతుకుతారు. కానీ పెట్రోల్‌ బంకుకు వెళ్లరు. ఇక మీద ఎమర్జెన్సీ టైంలో దర్జాగా బంక్‌లకు వెళ్లండి. అది మన హక్కు.
  • సగటున ఒక బంకులో రోజుకు 10 వేల లీటర్ల చమురు అమ్మితే.. టాయిలెట్‌ మెయింటనెన్స్‌ కాస్ట్‌ కింద ఆ బంకుకు వచ్చే ఆదాయం రోజుకు రూ.600 అంటే నెలకు రూ.18వేలు. జిల్లాలో ఉన్న అన్ని బంకుల్లో కలిపి వాహనదారులు రోజువారీగా చెల్లిస్తున్న మొత్తం రూ.14లక్షలకు పైనే. ఈ డబ్బుతో టాయిలెట్‌, మంచినీరు అందించాల్సిన బాధ్యత ఆయా బంక్‌లదే.
  • పెట్రోల్‌ పంపుల వద్ద స్వచ్ఛమైన తాగునీటి వసతి ఉండాలి. ఇందుకోసం ఆర్వోయంత్రం, వాటర్‌ కూలర్‌, వాటర్‌ కనెక్షన్‌ స్వయంగా పొందాలి. ఏ బంకుల్లోనైనా తాగునీటి వసతి లేకపోతే చమురు మార్కెటింగ్‌ సంస్థకు ఫిర్యాదు చేయొచ్చు. స్వచ్ఛభారత్‌లో భాగంగా అన్ని పెట్రోలు, డీజిల్‌ బంకుల్లో వాహనదారులు, ప్రజల సౌకర్యార్థం శుభ్రతతో కూడిన మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
  • అత్యవసర పరిస్థితుల్లో చరవాణి వినియోగించుకునే సదుపాయం పంపుల్లో ఉండాల్సిందే. మీరు వెళ్లే మార్గంలో ఏదైనా సమస్యలో చిక్కుకుంటే మీ వద్ద మొబైల్‌ ఫోన్‌ అందుబాటులో లేకపోతే భయపడాల్సిన పనిలేదు. ఏదైనా పెట్రోలు పంపును సందర్శించడం ద్వారా మీరు ఏ నంబర్‌కు అయినా కాల్స్‌ చేసుకోవచ్చు.
  • వాహన టైర్లలో గాలి నింపడానికి, గాలి శాతం తనిఖీ చేసుకోవడానికి యంత్రాన్ని అందుబాటులో ఉంచాలి. గాలి నింపేందుకు ఓ వ్యక్తిని అందుబాటులో ఉంచాలి. ఈ సౌకర్యం పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. ఇటీవల గాలికి ప్రత్యామ్నాయంగా నైట్రోజన్‌ నింపుతున్నారు.
  • ప్రతి బంకులో ఫిర్యాదు పెటె్‌ట్‌ లేదా రిజిష్టరు అందుబాటులో ఉంచాలి. అందులో వినియోగదారులు తమ ఫిర్యాదులను నమోదు చేయొ చ్చు. ప్రఽథమ చికిత్స కిట్‌ సౌకర్యం ప్రతీ బంకు వద్ద ఉండాలి. ప్రజలకు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకునే వీలుంటుంది.
  • చమురు నాణ్యత, ప్రమాణాలను తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉంటుంది. పెట్రోలు, డీజిల్‌ నాణ్యత, పరిమాణాన్ని తెలుసుకునేందుకు ఫిల్టర్‌ పేపర్లు అందుబాటులో ఉంచాలి. వాటి ద్వారా నాణ్యతను పరీక్షించుకునే హక్కు మనకు ఉంటుంది.
  • పెట్రోలు బంకుల్లో సంస్థ పేరు, యజమాని పేరు, సంప్రదింపుల నంబర్లు కచ్చితంగా ఏర్పాటు చేయాలి. పంపు యజమాని వాటిని ప్రజలకు కనిపించే విధంగా బంకుల ఎదుట ఏర్పాటు చేయాలి. పెట్రోలు బంకుల్లో బంకులు తెరిచే, మూసివేసే వేళలు తప్పనిసరిగా రాసి ఉంచాలి. పెట్రోలు, డీజిల్‌ తీసుకున్న తరువాత వినియోగదారులు వాటికి సంబంధించిన బిల్లులు తప్పనిసరిగా పొందాలి.

ఇలా ఫిర్యాదు చేయండి
పెట్రోలు బంకుల్లో వినియోగదారులకు అందించాల్సిన సౌకర్యాలను నిర్వాహకులు విస్మరిస్తే సెంట్రలైజ్డ్‌ పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెస్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ పోర్టల్‌ను సంప్రదించడం ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. బంకులో కచ్చితంగా ఉండాల్సిన ఫిర్యాదు రిజిష్టరులో లిఖితపూర్వకంగా ఫిర్యాదు నమోదు చేయొచ్చు. లేదంటే సంబంధిత చమురు సంస్థ సేల్స్‌ మేనేజర్‌ పేరు, చరవాణి నంబర్లకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఇవన్నీ అందుబాటులో లేనట్లైతే సంబంధిత తహసీల్దారు కార్యాలయంలో ఫిర్యాదు చేయొచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement