చేయూతగా ‘పీఎం విద్యాలక్ష్మి’ ..ఉన్నత చదువులకు వరం | -PM Vidyalaxmi Scheme Eligibility Criteria And Full Detailed Story | Sakshi
Sakshi News home page

చేయూతగా ‘పీఎం విద్యాలక్ష్మి’ ..ఉన్నత చదువులకు వరం

Published Fri, Jan 3 2025 12:19 AM | Last Updated on Fri, Jan 3 2025 3:40 PM

-PM Vidyalaxmi Scheme Eligibility Criteria And Full Detailed Story
  • పథకానికి గత నవంబర్‌లో కేంద్ర కేబినెట్‌ ఆమోదం

  • రూ.10 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు

కరీంనగర్‌: ప్రతిభ ఉన్నా ఉన్నత విద్య పేద విద్యార్థులకు అందని ద్రాక్షలా మారుతోంది. దీనికి ఆర్థిక పరిస్థితులే కారణమవుతున్నాయి. ఉన్నత విద్య, విదేశాల్లో చదువు కోసం గతంలో రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సిఫార్సులు, ఆస్తిపాస్తులు, ఉద్యోగ పూచీకత్తులు సమర్పించాల్సి వచ్చేది. అయినా. రుణం మంజూరు అవుతుందో లేదో తెలియని పరిస్థితి. ప్రస్తుతం అవేమీ అక్కర్లేదు. ఉన్నత చదువులకు పీఎం విద్యాలక్ష్మి(PM Vidyalaxmi Scheme) పథకం చేయూతనిస్తుంది. పీఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర కేబినెట్‌ గత నవంబర్‌లో ఆమోదం తెలి పింది.

విద్యాలక్ష్మి పోర్టల్‌..
పేద, మధ్యతరగతి వర్గాలకు ఉన్నత విద్యనందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చింది. చదువుకు సంబంధించిన వివరాలు వాస్తవికతతో ఉంటే చాలు రుణం పొందే అవకాశం ఈ పథకం కల్పిస్తోంది. దీనికి ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ఆర్థిక శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌(ఏబీఏ) సంయుక్తంగా విద్యాలక్ష్మి పోర్టల్‌(Vidyalaxmi Portal)ను అందుబాటులోకి తెచ్చాయి. ఎన్‌ఎస్‌డీఎల్‌ ఈ–గవర్నెన్స్‌ వ్యవస్థ ద్వారా ఈ పథకాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఎంత వరకు రుణం?
విద్యాలక్ష్మి పథకం ద్వారా రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఇందులో రూ.4.5 లక్షల వరకు రుణానికి కేంద్ర ప్రభుత్వమే వడ్డీ భరిస్తుంది. రుణం రూ.7.5 లక్షలు దాటితే పూచీకత్తు ఉండాలి.

వివరాలు నమోదు చేయాలి
పోర్టల్‌లో నమోదు చేసుకున్నాక www.vidyalakshmi.co.in వెబ్‌సైట్‌లో లాగిన్‌ అవ్వాలి. అందులో అడిగిన వివరాలు నమోదు చేయాలి. ఒక విద్యార్థి ఒకేసారి గరిష్టంగా మూడు బ్యాంకులకు విద్యారుణం కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.

జాతీయ ఉపకార వేతనాలకు సైతం..
విద్యాలక్ష్మి పోర్టల్‌ ద్వారా జాతీయ ఉపకార వేతనాలకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉన్నత చదువులు పూర్తి చేసిన వారిని పోర్టల్‌లో అనుసంధానం చేయడంలో భాగంగా ప్రతిభ ఉపకార వేతనాల వివరాలు పొందుపరుస్తున్నారు. రుణాలు, స్కాలర్‌షిప్‌లు అందుకొని, స్థిరపడినవారి స్ఫూర్తిదాయక గాథల్ని పేజీల్లో ఉంచారు.

ఏయే చదువులకు?
ఇంటర్‌, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, పీజీ డిప్లొమా, కాస్ట్‌ అకౌంటెన్సీ, చార్టెడ్‌ అకౌంట్‌, ఐఐఎం మేనేజ్‌మెంట్‌, ఐఐటీ, వృత్తి విద్యా కోర్సులు, విమానయాన రంగానికి సంబంధించిన కోర్సులు చదివేవారికి రుణాలు ఇస్తారు. యూజీసీ, ఏఐసీటీఈ ఇతర ప్రభుత్వ అధీకృత సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వారికి రుణాలు అందుతాయి.

దరఖాస్తు విధానం..
రుణాల కోసం మూడు పద్దతుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటగా విద్యాలక్ష్మి పోర్టల్‌లో నమోదు కావాలి. తర్వాత వివరాలతో కూడిన దరఖాస్తు పూరించాలి. చివరగా వివిధ రకాల బ్యాంకులను ఎంపిక చేసుకోవాలి. ఇదంతా పూర్తయితే రుణానికి సంబంధించిన వివరాల సమాచారం మొబైల్‌, ఈ–మెయిల్‌కు ఎప్పటికప్పుడు అందుతుంది.

జత చేయాల్సినవి..
విద్యాలక్ష్మి పథకంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద విద్యారుణాలు పొందేందుకు విద్యార్థులు పలు పత్రాలను దరఖాస్తుతోపాటు జత చేయాల్సి ఉంటుంది. చదివిన విద్యాసంస్థ నుంచి ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌(టీసీ), మార్కుల జాబితా, ఇంతవరకు పొందిన ఉపకార వేతన పత్రాలు, ఉన్నత విద్యకు సంబంధించిన ర్యాంకు కార్డు, ప్రవేశ అనుమతి పత్రాలు, చదవాల్సిన కోర్సుకు చెందిన ఫీజుల అంచనా వివరాలు, తల్లి, తండ్రి, సంరక్షకుడు, విద్యార్థికి సంబంధించిన పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు. తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి వేతన సర్టిఫికెట్లు, ఆస్తి వివరాలు, నివాస ధృవీకరణ కోసం ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు లాంటివి జత చేయాలి.

36 బ్యాంకులు..
విద్యాలక్ష్మి పోర్టల్‌లో 36 బ్యాంకులు నమోదై ఉన్నాయి. అవి విద్యారుణాలు ఇస్తాయి. ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్‌, విజయ, ఐవోబీ, యూనియన్‌, ఆంధ్రాబ్యాంక్‌, ఐడీబీఐ, యూబీఐ, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యూకో, దీనా, కరూర్‌వైశ్య, సిండికేట్‌, జీఏఏబీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేషన్‌ బ్యాంక్‌, యాక్సిస్‌, ఫెడరల్‌, న్యూ ఇండియా, ఆర్‌బీఎల్‌, అలహాబాద్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తదితర బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement