సౌదీలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
● మరో ముగ్గురికి గాయాలు
మెట్పల్లి/ఇబ్రహీంపట్నం: సౌదీ అరేబియాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధి కోసం వెళ్లిన పట్టణంలోని రేగుంటకు చెందిన కాపెల్లి రమేశ్ (30) మృతి చెందాడు. ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండకు చెందిన మరో ముగ్గురు గాయపడి అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం రేగుంటకు చెందిన రమేశ్ మూడు నెలల క్రితం ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడి జీజాన్లోని ఓ సప్లయ్ కంపెనీలో పనిచేస్తున్న 25 మంది ఎప్పటిలాగే మంగళవారం మినీ బస్సులో విధులకు బయల్దేరారు. ఎదురుగా వచ్చిన ట్రక్కు మినీ బస్సును ఢీకొనడంతో వివిధ దేశాలకు చెందిన 15 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో కాపెల్లి రమేశ్ కూడా ఉన్నారు. ఇదే సంఘటనలో వర్షకొండకు చెందిన జంగిటి శ్రీనివాస్ ఛాతిలో గాయం కావడంతో అక్కడ ఆసుపత్రికి తరలించారు. అరపల్లి శ్రీధర్ చేయి విరిగింది. సల్కం అంకిత్‌కు గాయాలు అయినట్లు కుటుంబసభ్యులకు సమాచారం చేరవేశారు. గాయపడిన వారు క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఇక్కడి కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. రమేశ్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఉపాధి కోసం వెళ్లిన అతడు అంతలోనే మృత్యువాత పడడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలవిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment