బందోబస్తు.. బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

బందోబస్తు.. బహిష్కరణ

Published Wed, Jan 29 2025 12:39 AM | Last Updated on Wed, Jan 29 2025 12:39 AM

బందోబ

బందోబస్తు.. బహిష్కరణ

● నిర్బంధం నడుమ బల్దియా వీడ్కోలు సభ ● ఆఖరిరోజు కార్పొరేటర్లకు చేదు అనుభవం ● బహిష్కరించిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు

కరీంనగర్‌ కార్పొరేషన్‌:

అసాధారణ నిర్బంధం నడుమ బల్దియా పాలకవర్గం వీడ్కోలు సభ ముగిసింది. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినా, అందుకు తగినట్లుగా నగరపాలకసంస్థ అధికారులు ఏర్పాట్లు చేయడంలో విఫలమవడంతో చివరిరోజు కార్పొరేటర్లకు చేదు అనుభవం ఎదురైంది. బీజేపీ కండువాతో ఉన్న మేయర్‌ సునీల్‌రావు చేతులమీదుగా సన్మానం చేయించుకోమంటూ బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు సభను బహిష్కరించారు. నిర్బంధంలో భాగంగా కార్యాలయ సేవలను పూర్తిగా నిలిపివేయడంతో, వివిధ సేవల కోసం వచ్చిన ప్రజలు వెనుదిరగాల్సి వచ్చింది.

అసాధారణ నిర్బంధం

నగరపాలకసంస్థ కార్యాలయంలో కార్పొరేటర్లు, కో– ఆప్షన్‌సభ్యులు, ఎక్స్‌ అఫిషియో సభ్యులకు ఆత్మీయ వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. మేయర్‌ యాదగిరి సునీల్‌రావు ఇటీవల బీజేపీలో చేరడం, ఆయనకు, బీఆర్‌ఎస్‌కు నడుమ మాటల యుద్ధం కొనసాగుతుండడం తెలిసిందే. ఈ క్రమంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు పోలీ సులు మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయానికి వెళ్లే రెండు గేట్లలో ఒక గేట్‌కు తాళం వేసి, మరో గేట్‌ వద్ద పోలీసులు తనిఖీ చేసి లోనికి పంపించారు. కార్పొరేటర్లను మినహా ఎవరినీ లోనికి అనుమతించొద్దని బల్దియా ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు వారిని మాత్రమే లోనికి పంపించారు. గుర్తించాల్సిన ఉద్యోగులు ప్రవేశం వద్ద లేకపోవడంతో, కార్పొరేటర్లను ఆపి పేర్లు అడగడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను పిలిచి అవమానిస్తారా అంటూ మండిపడ్డారు. గతంలో కార్పొరేటర్ల దంపతులను సన్మానించారని,వారిని కూడా అనుమతించాలని బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కింది అంతస్తులోని చాంబర్‌లో మాత్రమే కూర్చోవాలని చెప్పి కుటుంబసభ్యులను పంపించారు. మొదటి అంతస్తులోని హాల్‌లోకి కార్పొరేటర్లనే అనుమతించారు. ఆత్మీయ వీడ్కోలు సభభకు మీడియాను అధికారులు అనుమతించకపోగా, కౌన్సిల్‌ హాల్‌లో కాకుండా అధికారులు సమీక్షా సమావేశాలు పెట్టుకునే హాల్‌లో సన్మానించడం ఆశ్చర్యం కలిగించింది.

బీఆర్‌ఎస్‌ బహిష్కరణ

సభకు హాజరైన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు సన్మానం చేయించుకోకుండా వెనుదిరిగారు. ముగ్గురు కార్పొరేటర్లను సన్మానించాక మేయర్‌ అఫ్రాన్‌(మేయర్‌ వేసుకొనే గౌను)కు బదులుగా బీజేపీ కండువా వేసుకొని సన్మానం చేయడంపై బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ వి.రాజేందర్‌రావు అభ్యంతరం తెలిపారు. మేయర్‌ చేత తాము సన్మానం చేసుకోమనడంతో, మీరొచ్చినప్పుడు తాను పక్కకు జరుగుతానంటూ మేయర్‌ బదులిచ్చారు. ఇదే క్రమంలో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు సభను బహిష్కరించి బయటకు వ చ్చారు. మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రజాసేవలు బంద్‌

అసాధారణ నిర్బంధం నడుమ ప్రజలకు అందాల్సిన సేవలను కూడా అధికారులు పూర్తిగా నిలిపివేశారు. వివిధ సేవల కోసం కార్యాలయానికి వచ్చిన ప్రజలను మెయిన్‌ గేట్‌ నుంచి అటే పంపించారు. కార్యాలయానికి దూరంగా పౌరసేవా కేంద్ర భవనం ఉన్నప్పటికి, ప్రజలను రానీయకపోవడం వివాదాస్పదంగా మారింది.

ఆత్మీయ సన్మానం

పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో కార్పొరేటర్లను సన్మానించారు. బీఆర్‌ఎస్‌ మినహా, కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లను సన్మానించగా, మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పేయ్‌లను కార్పొరేటర్లు సన్మానించారు.

నగర రూపురేఖలు మార్చాం : మేయర్‌

తమ పాలకవర్గ హయాంలో అన్ని రంగాల్లో నగరాన్ని అభివృద్ధిచేశామని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు. మీడియాతో మాట్లాడుతూ వేల కోట్ల రూపాయలతో నగర రూపురేఖలు మార్చామన్నారు. తమ పదవీకాలం ఎంతగానో సంతృప్తినిచ్చిందన్నారు. కాగా మేయర్‌ బీజేపీ కండుడా కప్పుకొని సన్మానించడం సరికాదని మాజీ మేయర్‌, బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ సర్ధార్‌ రవీందర్‌ సింగ్‌ అన్నారు. సభకు ఆహ్వానించి తమను అవమానించారని కార్పొరేటర్‌ గందె మాధవి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బందోబస్తు.. బహిష్కరణ1
1/1

బందోబస్తు.. బహిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement