‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి: బీజేపీ
కరీంనగర్‌టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేయడానికి పోలింగ్ బూత్ అధ్యక్షులు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ గోదాంగడ్డలోని ఎస్బీఐ ఫంక్షన్హాల్లో మంగళవారం పోలింగ్ బూత్ అధ్యక్షులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ పోలింగ్ బూత్ అధ్యక్షులు పార్టీని బలోపేతం చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్‌గౌడ్, మాడ వెంకటరెడ్డి, మేయర్ వై.సునీల్‌రావు, కన్నబోయిన ఓదెలు, వాసాల రమేశ్ పాల్గొన్నారు.
‘రాజకీయ సన్యాసం తీసుకుంటావా?’
కరీంనగర్: సాక్ష్యాలతో మీ అవినీతిని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ మాజీ మేయర్ సునీల్‌రావుకు సవాల్ విసిరారు. మంగళవారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయంలో మాట్లాడుతూ సునీల్‌రావు ఓ ఐరన్‌లెగ్ అని విమర్శించారు. గత ఐదేళ్లలో మేయర్‌గా ఆయన చేసిన అవినీతిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. బండి సంజయ్ సునీల్ రావుతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, బీఆర్ఎస్ నాయకులు రాజేందర్రావు, మహేశ్, గందె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, తిరుపతి పాల్గొన్నారు.
టీబీ రహిత జిల్లాగా మార్చాలి
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ జిల్లాను టీబీ రహితంగా మార్చడానికి అన్ని ప్రభుత్వశాఖలు కృషి చేయాలని జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ కేవీ.రవీందర్‌రెడ్డి కోరారు. మంగళవారం కరీంనగర్ మండల పరిషత్తు సమావేశ మందిరంలో ఇంపాక్ట్ ఇండియా ఆధ్వర్యంలో టీబీ ముక్త్ గ్రామపంచాయతీ కా ర్యక్రమంలో భాగంగా కరీంనగర్‌రూరల్, కొత్తపల్లి, గన్నేరువరం మండలాల పంచాయ తీ కార్యదర్శులకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఎంపీడీవో సంజీవరావు, ఎంపీవోలు జగన్మోహన్రెడ్డి, నర్సింహరెడ్డి పాల్గొన్నారు.
సదరం షెడ్యూల్ ఖరారు
కరీంనగర్‌టౌన్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సదరం షెడ్యూల్ ఖరారు చేశారు. ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించిన సదరం తేదీలను మంగళవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో ఆర్థో, 6న మానసిక రోగులు, 10న కంటి చూపు, 13న వినికిడి మూగ (చెవుడు), మార్చి 4న ఆర్థో, 11న మానసిక రోగులు, 18న కంటి చూపు, 24న వినికిడి మూగ (చెవుడు) నిర్ధారణ శిబిరాలు నిర్వహించనట్లు తెలిపారు. ఈనెల 29వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి మీ సేవల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
నేడు గాంధీభవన్‌లో ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం
కరీంనగర్ కార్పొరేషన్: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు, సంక్షేమ పథకాలు, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, డీసీసీ అధ్యక్షులు, ఆహ్వానితులు హాజరుకానున్నారు.
‘రైతు భరోసా’ విడుదల
కరీంనగర్ అర్బన్: రైతు భరోసా పెట్టుబడి సాయం రైతుల ఖాతాకు చేరింది. మండలానికో గ్రామాన్ని ఎంపిక చేయగా సదరు గ్రామాల రైతుల ఖాతాకు ఎకరాకు రూ.6వేల చొప్పున చేరాయి. 14,226 మంది రైతులకు గానూ రూ.15,96,31,095 నిధులు విడుదలయ్యాయి. 313 గ్రామాలకు గానూ 15 గ్రామాలకు రైతు భరోసా జమవగా మిగతా గ్రామాలకు రెండు, మూడు రోజుల్లో ప్రక్రియ ప్రారంభమవుతుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment