కోడ్ ఉల్లంఘిస్తే ఉపేక్షించం
● కలెక్టర్ పమేలా సత్పతి ● రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
కరీంనగర్ అర్బన్: ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఉపేక్షించమని కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. మార్చి 8 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ర్యాలీలు, సమావేశాలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. ఫిర్యాదులుంటే అభ్యర్థులు గానీ, ఇతరులు గానీ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించే ఆర్డీవోలకు చేయాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలను నమోదు చేస్తామన్నారు. ఎన్నికలకు 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు.
విద్యార్థులను ట్రాఫిక్ పార్కుకు తీసుకురండి
తిమ్మాపూర్(మానకొండూర్): పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా తిమ్మాపూర్‌లోని రవాణా శాఖ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. చొక్కారావు పిల్లల ట్రాఫిక్ అవగాహన పార్కును పరిశీలించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులను బ్యాచ్‌ల వారీగా ఈ పార్కుకు తీసుకొచ్చి, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల పిల్లల నుంచి నామమాత్రపు ఫీజు తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల వారికి ఉచితంగా సందర్శించే అవకాశం కల్పించాలన్నారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఈవో జనార్దన్‌రావు, డీటీసీ పురుషోత్తం, డీటీవో చక్రవర్తి శ్రీకాంత్, సమగ్ర శిక్ష కో–ఆర్డినేటర్ అశోక్, ఎంవీఐ రవికుమార్, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment