కర్ణాటక: విధానసభ ఎన్నికలలో కప్పల తక్కెడ నేతలకు ముఖభంగమైంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు మారిన అనేక మంది ఓడిపోయారు. 30 నియోజకవర్గాలలో పార్టీలు మారిన నేతలు పోటీ చేశారు. వారిలో 8 మంది మాత్రమే గెలిచారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన లక్ష్మణ సవది, బీజేపీ నుంచి జేడీఎస్‌లో చేరిన ఏ.మంజు గెలిచారు. కాగవాడలో రాజు కాగె బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి, అరసికెరెలో శివలింగేగౌడ జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి గెలిచారు. గుబ్బిలో ఎస్‌ఆర్ శ్రీనివాస్ జేడీఎస్ నుంచి కాంగ్రెస్ టికెట్ ద్వారా ఎన్నికయ్యారు. హగరి బొమ్మనహళ్లిలో నేమిరాజ నాయక్ బీజేపీ నుంచి జేడీఎస్ టికెట్ ద్వారా, మొళకాల్మూరులో ఎన్‌వై గోపాలకృష్ణ బీజేపీ నుంచి కాంగ్రెస్ టికెట్‌తో పోటీచేసి ఎన్నికయ్యారు. చిక్కమగళూరులో హెచ్‌డీ తమ్మయ్య బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి గట్టెక్కారు.
వీరికి చేదు ఫలితం
బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం జగదీశ్ షెట్టర్‌కు హుబ్లీ సెంట్రల్ అనూహ్యంగా పరాభవం ఎదురైంది. ఇదేరీతిలో బీజేపీని వీడిన పుట్టణ్ణ (రాజాజీనగర), బాబురావ్ చించనూర్ (గురుమి ట్కల్)లో ఓడారు. కాంగ్రెస్ నుంచి జేడీఎస్‌లో చేరి పోటీచేసిన రఘుఆచార్(చిత్రదుర్గ), తేజస్వీ పటేల్ (చన్నగిరి), ఎల్‌ఎస్ పోట్నెకర్ (హళియాళ), మనోహర్ తహశీల్దార్ (హానగల్), మొయిద్దీన్ బావా(మంగళూరు ఉత్తర), సౌరభ్ చోప్రా (సవదత్తి యల్లమ్మ) ఓడారు. బీజేపీ నుంచి జేడీఎస్‌లో చేరిన ఎ.బీ మలకరెడ్డి (యాదగిరి), ఆయనూరు మంజునాథ్(శివమొగ్గ), భారతీ శంకర్ (వరుణ), ఎన్‌ఆర్ సంతోష్(అరసికెరె), వీరభద్రప్ప హలరవి (హుబ్లీ–ధారవాడ తూర్పు), దొడ్డప్పగౌడ నరిజోళ (జీవర్గి) సూర్యకాంత్ (బీదర్)లో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment