
కర్ణాటక: రాబోయే అక్టోబర్, నవంబర్ నెలల్లో రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు ఉంటాయని జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి జోస్యం చెప్పారు. గురువారంనాడు రామనగరలో మాట్లాడిన ఆయన కొత్తగా ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం నిలకడగా ఉండదని, మూడు నెలల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయన్నారు.
త్వరలో తాలూకా,జిల్లా పంచాయతీల ఎన్నికలు వస్తాయని, అప్పుడు పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో అనుకున్న స్థానాల్లో గెలవకపోవడానికి అనేక కారణాలున్నాయని, ఈ ఓటమి వల్ల పార్టీకి ఢోకా ఏమీ లేదని, ఇలాంటి పరాజయాలు తమకు కొత్త కాదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం అంత సులభం కాదన్నారు. ప్రకటించిన పథకాలకు ఏడాదికి కనీసం రూ. 70 వేల కోట్లు అవసరమని, అన్ని నిధులను ఎలా సమకూరుస్తారని ప్రశ్నించారు.