డెడ్ స్టోరేజీకి తుంగభద్ర డ్యాం
సాక్షి,బళ్లారి: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రైతుల్లో ఆందోళన నెలకొంటోంది. ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి వరణుడు ముఖం చాటేయడంతో రైతులు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. జిల్లాలో తుంగభద్ర ఆయకట్టుతో పాటు, వర్షాధారిత భూములు దాదాపు ఐదు లక్షలు ఎకరాలు సాగుభూమి ఉంది.
ఇందులో తుంగభద్ర ఆయకట్టు కింద దాదాపు మూడు లక్షల ఎకరాలు సాగుభూమి ఉండగా, మిగిలిన భూమి వర్షాధారిత ఆధారంగా పంటలు పండిస్తున్నారు. బళ్లారి, సిరుగుప్ప, కంప్లి, సండూరు నియోజకవర్గాల పరిధిలో ఇప్పటి వరకు కేవలం రెండు వేల ఎకరాల్లో మాత్రమే విత్తనాలు సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షలు ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా జూన్ నెల దాటే సమయం వస్తున్నప్పటి ఇప్పటి వరకు సరైన పదును వాన రాకపోవడం విత్తన సాగు ప్రశ్నార్థంగా మారింది.
దుక్కులు దున్ని దిక్కులు
అష్టకష్టాలతో దుక్కులు దున్ని విత్తన సాగుకు రైతులు సిద్ధం చేసుకున్నారు. మరోవైపు రైతులకు విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని వ్యవసాయాధికారి మల్లికార్జున సాక్షికి తెలిపారు. జిల్లాలో ప్రధానంగా వర్షాధారిత భూముల్లో జొన్న, సజ్జ, రాగి, మొక్కజొన్న, కంది తదితర పంటలు సాగు చేస్తుండగా, వర్షాలు ఆలస్యం కావడంతో జొన్న సాగు చేయడానికి కష్టతరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాధారిత భూముల్లో దుక్కిలు దున్ని పొలాలు సిద్ధం చేసి వర్షం కోసం ఎదురుచూస్తుండగా, తుంగభద్ర డ్యాం ఖాళీ కావడంతో ఆయకట్టు రైతులు పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది.
ముందుగా వరినారు సిద్ధం చేసుకునేందుకు కూడా భయపడుతున్నారు. సాధారణంగా జూన్ రెండవ వారంలోపు తుంగభద్ర డ్యాంలోకి ఇన్‌ఫ్లో బాగా పెరుగుతుండేవి. ఇప్పుడు డ్యాంలో నిల్వలు అడుగంటాయి. 4 టీఎంసీలు పడిపోవడంతో ఇన్‌ఫ్లోలు జీరో అయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో 40 టీఎంసీలకు పైగా ఉండటంతో రైతులు ఆయకట్టులో వ్యవసాయ పనులు చేసుకునేవారు. ఈ ఏడాది డ్యాంలో నీటిమట్టం ఎప్పుడు పెరుగుతుందా, వర్షాలు ఎప్పుడు వస్తాయా అని రైతులు ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment