బనశంకరి: ఐటీ సిటీలో పట్టుబడిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదుల ఇంట్లో సీసీబీ పోలీసులు గురువారం సోదాలు చేసి నాలుగు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌టీ నగర సుల్తాన్‌పాళ్య ఇంట్లో మకాంవేసి భారీ విధ్వంసానికి కుట్రపన్నిన కేసులో విచారణను ముమ్మరం చేశారు. నిందితులిచ్చిన సమాచారంతో కొడిగేహళ్లిలోని ఓ ఇంట్లో దాచిన గ్రనేడ్లను కనుగొన్నారు. విదేశాల్లో తలదాచుకున్న జునైద్ అనే వ్యక్తి తనకు నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు పంపించాడని అనుమానితుడు జాహిద్ చెప్పాడు. బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ సిబ్బంది చేరుకుని వాటిని సీజ్ చేశారు. ఈ కేసు విచారణకు ఒక విచారణాధికారితో పాటు ఇద్దరు ఏసీపీలు, 6 మంది సీఐలతో ప్రత్యేక బృందంతో ఏర్పాటైంది. ఇప్పటికే వారి నుంచి పలు నాటు పిస్టళ్లు, తూటాలను స్వాధీనం చేసుకోవడం తెలిసిందే.
యూపీ నుంచి ఆయుధాలు?
అనుమానిత ఉగ్రవాదులకు ఉత్తరప్రదేశ్ నుంచి ఆయుధాలు సరఫరా అయినట్లు తెలిసింది. లోతైన విచారణకు ఒక పోలీస్ బృందం యూపీకి వెళ్లింది. అనుమానితుల వద్ద దొరికిన తూటాలు ప్రత్యేకమైనవని, వీటిని మిలిటరీ, పోలీసులు విదేశీ ఉగ్రవాద సంస్థలు ఉపయోగించేవని గుర్తించారు. వారి వద్ద దొరికిన 7 నాటు పిస్తోల్స్ ను ఎక్కడైనా ఉపయోగించారా? అనేది తనిఖీ కోసం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు.
పరప్పన ఖైదీ నజీర్ నిర్బంధం
పరప్పన జైలులో అనుమానిత ఉగ్రవాదులకు ఉగ్రబోధన చేసిన నజీర్‌ను సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2008లో బెంగళూరులో సంభవించిన వరుస బాంబుపేలుళ్లు కేసులో సూత్రధారి నజీర్ పరప్పన అగ్రహార జైలులో ఖైదులో ఉన్నాడు. ఇతర కేసుల్లో జైలులో చేరిన ఐదుమంది అనుమానిత ఉగ్రవాదులకు నజీరే బ్రెయిన్‌వాష్ చేసి దుశ్చర్యలకు పాల్పడానికి శిక్షణ ఇచ్చాడు. వారికి లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాల్ని కల్పించినట్లు నిర్ధారించారు.
పోలీసులే గ్రెనేడ్లు పెట్టారని ఆరోపణ
నా సోదరుడు జాహిద్ తబ్రేజ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, ఎవరి జోలికీ వెళ్లేవాడు కాదు, మేం అలాంటివాళ్లం కాదు, కానీ పోలీసులే మా ఇంట్లో గ్రెనేడ్లు తెచ్చిపెట్టారని అనుమానిత ఉగ్రవాది జాహిద్ సహోదరుడు అవేజ్ ఆరోపించాడు. బెంగళూరు కొడిగేహళ్లిలో ఇంట్లో విలేకరులతో అవేజ్ మాట్లాడుతూ గురువారం ఉదయం తన సోదరున్ని ఇంటికి తీసుకువచ్చిన పోలీసులు వారే గ్రెనేడ్లను పెట్టారని చెప్పాడు.
ఆడపిల్లలను చూసి ఇల్లు అద్దెకిచ్చా
భార్య, ఇద్దరు ఆడపిల్లలతో కలిసి ఒకటిన్నర నెలక్రితం వచ్చి ఇంటిని బాడుగకు అడిగాడు, పేదవాళ్లమని, రెండు నెలల తరువాత అడ్వాన్సు ఇస్తామని చెప్పాడు, ఆడపిల్లల ముఖం చూసి ఇంటిని అద్దెకు ఇచ్చామని ఇంటి యజమానురాలు వాపోయింది. బెంగళూరు ఆర్‌టీ.నగర కనక నగరలో మసీదు వద్ద గల ఇంట్లోకి ఒకటిన్నర నెల క్రితం అనుమానిత ఉగ్రవాది సయ్యద్ కుటుంబంతో అద్దెకు దిగాడు. బుధవారం సీసీబీ పోలీసులు ఇంటిపై దాడిచేసి సయ్యద్‌ను అరెస్టు చేయడంతో ఇంటి యజమానులు అవాకై ్కంది. గురువారం మీడియా ముందు చేతులెత్తి నమస్కరిస్తూ గోడు వెళ్లబోసుకుంది. సమయం దాటినా కానీ అడ్వాన్సు ఇవ్వకపోవడంతో ఇంటిని ఖాళీచేయాలని చెప్పానని, ఈ వారంలో విడిచిపెడతానని చెప్పాడని, ఇంతలోనే ఇలా జరిగిందని తెలిపింది.
దావణగెరెలో మరొకరు..
దావణగెరెలో గురువారం మరో అనుమానిత ఉగ్రవాదిని అరెస్ట్‌చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో ఆజాద్‌నగరలో నివసించే ఫయాజుల్లా (32)ని నిర్బంధించారు. ఇతనిపై ఐదు అక్రమాయుధాల కేసులు ఉన్నాయని జిల్లా ఎస్పీ కే.అరుణ్ తెలిపారు. ఫయాజుల్లా బెంగళూరు, చిత్రదుర్గలో ఉడ్ వర్క్ పాలిష్ పనిచేసేవాడు. మొదటి భార్య బెంగళూరు ఆర్‌కే హెగ్డేనగర రెండోక్రాస్‌లో, రెండవభార్య దావణగెరెలో ఉంటోంది. అప్పుడప్పుడు బెంగళూరు నుంచి దావణగెరెకు వచ్చి వెళ్లేవాడు.
Comments
Please login to add a commentAdd a comment