యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లాలో పీయూసీ విద్యార్థిని సౌజన్య హత్య రహస్యాలను బయటపెడితే తనను కూడా హత్య చేసే అవకాశం ఉందని బెళ్తంగడి మాజీ ఎమ్మెల్యే వసంత బంగేర అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ సౌజన్య అత్యాచారం, హత్య కేసును సీబీఐ దారి తప్పించింది. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సీబీఐకీ అప్పగించాలని డిమాండ్ చేశాను.
అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య పిలిచి సీబీఐకి అప్పగించడం సాధ్యం కాదన్నారు. బెళ్తంగడిలో జరిగిన అనేక హత్యల గురించి కూడా సీఎంకు చెప్పాను, చివరకు సీబీఐ విచారణకు ఇచ్చారు. సౌజన్య హత్య గురించి ఏమైనా మాట్లాడితే తాను కూడా హత్యకు గురి కావచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
11 ఏళ్లుగా పెండింగ్ కేసు...
సౌజన్య హత్యాచారం ఘటన దక్షిణ కన్నడ జిల్లాలో కొన్నినెలలుగా మళ్లీ చర్చనీయాంశమైంది. పోటాపోటీగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. 2012 అక్టోబరు 9న ఉజిరె పట్టణంలో కాలేజీకి వెళ్లిన సౌజన్య (17) మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. రాత్రంతా పోలీసులు, స్థానికులు గాలించగా ఇంటికి వెళ్లే దారిలో చిట్టడవిలో శవమై కనిపించింది. ఆమెను అత్యాచారం చేసి హత్య చేశారని విచారణలో తేలింది.
సమీపంలో జీవించే సంతోష్ రావ్ (34) అనే ఒంటరి మనిషి ఈ హత్య చేశాడని అరెస్టు చేశారు, కానీ నేరం చేయలేదని తెలిసి కొన్నినెలలకు వదిలేశారు. జిల్లాలో బడా బాబులకు చెందిన పిల్లలే సౌజన్యపై అఘాయిత్యం చేసి హతమార్చారని ఆమె బంధువులు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. సీబీఐ కూడా దోషులను కనిపెట్టలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment