కర్ణాటక: ధరలు భగ్గుమనడంతో మొన్నటివరకు రైతులు టమాట తోటలకు సీసీ కెమెరాలు, పహిల్వాన్లను పెట్టి గస్తీ కాయడం తెలిసిందే. ఇప్పుడు చిక్కబళ్లాపుర జిల్లా కేంద్రం పరిధిలోని నాయనహళ్లి అందార్లహళ్లి, చదలపుర, నంది తదితర గ్రామాలలో దానిమ్మ తోటలను రైతులు తుపాకులతో కాపలా కాస్తున్నారు. దానిమ్మ పండ్లు మేలిరకం కేజీ ధర రూ.150 నుంచి 200 దాకా మార్కెట్‌లో ఉంది.
తుపాకీ, కారంపొడితో గస్తీ
తరచూ తోటల్లోకి దొంగలు చొరబడి పండ్లను ఎత్తుకెళ్తున్నారు. దీంతో రైతులు రాత్రి వేళలో కాపలా కాస్తున్నారు. నాయనహల్లి గ్రామంలో రైతు చందన్ రెండు ఎకరాలలో రూ. 5 లక్షల ఖర్చుపెట్టి దానిమ్మ పంట పండిస్తున్నాడు. వారం కిందట ఈయన తోటలో దొంగలు పడి సుమారు టన్ను బరువైన దానిమ్మ పండ్లను దొంగిలించుకొనిపోయారు. పక్కనే దేవరాజ్ తోటలోనూ ఇంతేమొత్తంలో దానిమ్మను ఎత్తుకెళ్లారు.
చదలపురంలో మునిరాజు అనే రైతు తమ చుట్టాలను ఇంటికి పిలిపించుకొని రాత్రి వేళలో తుపాకీ, కారంపొడి పట్టుకొని గస్తీ కాస్తున్నారు. తుపాకీకి లైసెన్స్ ఉందని తెలిపారు. ఈయన ఆరు ఎకరాలలో దానిమ్మ సాగు చేస్తున్నారు. ఒకవేళ దొంగలు కానీ చేతికి చిక్కితే వారి పని అయిపోయినట్టే అంటున్నారు తోటల యజమానులు.
Comments
Please login to add a commentAdd a comment