
పక్కాగా సాక్ష్యాల సేకరణ
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో సంచలనం రేపిన చిత్రదుర్గకు చెందిన ఆటోడ్రైవర్ రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ అండ్ గ్యాంగ్ సంచరించిన 28 ప్రాంతాల్లో మహజర్ నిర్వహించిన పోలీసులు.. ఏకంగా 139 వస్తువులను సాక్ష్యాలుగా సేకరించారు. నిందితులు ధరించిన దుస్తులు, షూస్, చెప్పులు, దాడికి ఉపయోగించిన వస్తువులు, హోటల్ లెడ్జర్ బుక్, సీసీటీవీ కెమెరా పేటేజీలు, వాహనాలు, నగదు, మృతదేహంపై నుంచి దోచిన నగలు ఇలా ఒక్కటీ వదలకుండా పోలీసులు సాక్ష్యాలుగా తీసుకువచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా దర్శన్ అనుచరుడు వినయ్ ఫోన్‌లో చాటింగ్ చేసిన మెసేజ్‌లు కేసులో కీలకంగా మారనున్నాయి. దర్శన్ రేణుకాస్వామిపై దాడి చేసిన దృశ్యాన్ని ముగ్గురు యువకులు మొబైల్‌లో వీడియో తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీడియోలను సేకరించారు.
పవిత్రగౌడ పాత్రనే కీలకం
రేణుకాస్వామి హత్య జరగడానికి నటి పవిత్రగౌడ ముఖ్య కారణమని పోలీసుల రిమాండ్ కాపీలో పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పవిత్ర ఏ3 నుంచి మొదలుకుని ఏ7, ఏ11, ఏ12, ఏ13, ఏ16 నిందితులు హత్యలో నేరుగా పాల్గొన్నారని, వీరందరికీ చట్టంపై కనీసం గౌరవం లేదని లభించిన సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తోందని రిమాండ్ కాపీలో పేర్కొన్నారు. ఏ1 ముద్దాయి పవిత్ర,రేణుకాస్వామి హత్యకు అందరినీ ప్రేరేపించినట్లు తెలిపారు.
బెయిల్‌కు దర్శన్ ప్రయత్నాలు
రేణుకాస్వామి హత్య కేసులో ఏ2గా ఉన్న దర్శన్ బెయిల్ పిటిషన్ పెట్టుకోనున్నారు. దర్శన్ కేసు వాదించడానికి అనిల్, బాబు, రంగనాథ్‌రెడ్డి అనే లాయర్‌లను నియమించుకున్నారు. అదేవిధంగా సీనియర్ లాయర్ సీవీ నాగేశ్‌ను కూడా దర్శన్ నియమించుకున్నారు. ఇటీవల జైలుపాలైన మాజీ మంత్రి రేవన్న కేసును నాగేశ్ వాదించి బెయిలు ఇప్పించారు. అనేక క్రిమినల్ కేసులు వాదించిన అనుభవం ఆయనకు ఉంది. దర్శన్‌కు కూడా బెయిల్ ఇప్పించే ప్రయత్నంలో భాగంగా లాయర్ నాగేశ్, అసిస్టెంట్ లాయర్ రాఘవేంద్ర ఇప్పటికే అన్నపూర్ణేశ్వరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసుకు సంబంధించి పూర్తి సమాచారం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment