ప్రజ్వల్‌కు సుప్రీంలో నిరాశ
శివాజీనగర: అత్యాచారం, లైంగిక వీడియోల కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ప్రజ్వల్ జర్మనీ నుంచి తిరిగి వచ్చిన తరువాత మేలో బెంగళూరులో విమానాశ్రయంలో సీఐడీ బృందం అతనిని అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఖైదులో ఉన్నాడు. హైకోర్టులో బెయిలు దక్కకపోవడంతో సుప్రీంను ఆశ్రయించాడు. అక్కడా చుక్కెదురు కావడంతో ప్రజ్వల్ కుటుంబం డీలా పడింది.
కీచక ప్రిన్సిపాల్‌పై గరం గరం
శిడ్లఘట్ట: తాలూకాలోని గొర్లగుమ్మనహళ్లిలోని ఎస్టీ వర్గాల సంక్షేమ శాఖ మొరార్జీ దేశాయి మోడల్ వసతి పాఠశాల ప్రిన్సిపాల్ వేధింపులపై పిల్లల తల్లిదండ్రులు మండిపడ్డారు. సోమవారం పాఠశాలలో ఆ శాఖ అధికారులు, తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనపై ఫిర్యాదుల వర్షం కురిసింది. బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, ఏళ్లతరబడి తిష్టవేసి పాఠశాలను గుప్పిట్లో పెట్టుకున్నాడని ఆరోపించారు. అతనిని బదిలీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రుల గోడును ఆలకించిన సాంఘిక సంక్షేమ శాఖ డీడీ తేజానందరెడ్డి, అధికారులు మాట్లాడుతూ ఉన్నతాధికారుల సూచనల మేరకు తగిన చర్యలు చేపడతామని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. జిల్లా ఎస్టీ వర్గాల సంక్షేమ అధికారి ప్రవీణ్ పాటిల్, సాంఘిక సంక్షేమ శాఖ ఏడీ జగదీష్, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
వీడిన జంట హత్యల మిస్టరీ
● పాత నేరగాడు పట్టివేత
దొడ్డబళ్లాపురం: అవమానకరంగా మాట్లాడారనే కోపంతో ఇద్దరు సహోద్యోగులను హత్య చేసిన కిరాతకున్ని బాగలూరు పోలీసులు అరెస్టు చేసారు. ఈ నెల 8న బాగలూరు పరిధిలోని సింగహళ్లి వద్ద ఒక బస్ సర్వీస్ షెడ్‌లో నాగేశ్ (52), మంజునాథ్(50)అనే ఇద్దరు మెకానిక్‌లు హత్యకు గురయ్యారు. పోలీసులు దర్యాప్తు చేసి సురేశ్ అనే మరో మెకానిక్‌ను అరెస్టు చేసారు. నాగేశ్ ,మంజునాథ్ ఇద్దరూ నిత్యం మద్యం తాగివచ్చి దూషించేవారని, ఆ కోపంతో వారు నిద్రలో ఉండగా ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసి పరారయ్యాడు.
దునియా విజయ్ సాయం
నిందితుడు సురేశ్‌పై గతంలోనే హత్య, రేప్ కేసులు నమోదై ఉన్నాయి. 10 ఏళ్లు జైలుశిక్ష పడింది. అప్పట్లో ప్రముఖ నటుడు దునియా విజయ్.. సామాజిక సేవ పేరుతో కొందరు నేరస్తులకు ష్యూరిటీ ఇచ్చి జైలు నుండి బయటకు తీసుకువచ్చాడు. వారిలో సురేశ్ కూడా ఉన్నాడు. బయటకు వచ్చిన సురేశ్ కొన్ని రోజలు కొత్తిమీర వ్యాపారం చేసి తరువాత సింగరహళ్లిలో ఉన్న బస్సు సర్వీస్ షెడ్‌లో పనికి చేరాడు. అక్కడ డబుల్ మర్డర్‌కు పాల్పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment