మైక్రో ఫైనాన్స్‌లకు చెక్
బనశంకరి: రాష్ట్రమంతటా మైక్రో ఫైనాన్స్‌ల ఒత్తిళ్ల వల్ల 180 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి అపకీర్తి తెచ్చిపెట్టింది. నిత్యం ఏదో ఒకచోట వేధింపులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రో ఫైనాన్స్ కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా రుణాల వసూళ్లకు పాల్పడితే, 6 నెలల నుంచి, గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల నుంచి లక్ష వరకు జరిమానా విధించేలా కఠిన చట్టం రూపొందిస్తామని మంత్రి హెచ్‌కే పాటిల్ చెప్పారు. రుణాలు అందించే సంస్థలు, రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం నమోదు చేసుకొని ఉండాలి, ఇప్పటివరకు నమోదు కాకుండా ఉండే అలాంటి సంస్థలు 30 రోజుల్లోగా నమోదు చేసుకోవాలి. లేనిపక్షంలో జప్తు చేస్తామని చెప్పారు. అక్రమంగా రుణ వసూళ్ల చర్యలకు ఒడిగట్టే సంస్థలపై ఫిర్యాదు ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులకు అవకాశం కల్పించామని తెలిపారు. రుణగ్రహీతలపై వేధింపులకు పాల్పడితే అలాంటి సంస్థల లైసెన్సు రద్దు చేయడం కనీసం 3 నెలలు జైలుశిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధించేలా చట్టాన్ని తీసుకు వస్తామని మంత్రి తెలిపారు.
అప్పు భారంతో రుణగ్రహీతలు
సతమతం
వేధింపులకు పాల్పడితే 3 ఏళ్ల జైలుశిక్ష, రూ.లక్ష వరకూ జరిమానా
త్వరలోనే ఆర్డినెన్స్ జారీ: మంత్రి పాటిల్
ఈ నిబంధనలు పాటించాలి
మైక్రో ఫైనాన్స్ సంస్థలు అప్పు తీసుకునేవారికి దస్తావేజులను స్థానిక భాషలో అందించాలి. రుణం, వడ్డీతో పాటు అన్ని వివరాలను స్పష్టంగా తెలియజేయాలి.
రుణ గ్యారంటీ, ఆస్తి పత్రాలు ఇతర విషయాలు గురించి వివరించాలి.
రుణగ్రహీత శక్తి మేరకే అప్పు మొత్తం ఉండాలి. బలవంతంగా రుణాల వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ నేరమవుతుందని మంత్రి చెప్పారు.
అసెంబ్లీ సమావేశాలు ఇప్పట్లో లేనందున, ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని అమలులోకి తెస్తాము, గవర్నర్ గెహ్లాట్‌కు ఆర్డినెన్స్ కాపీని రెండుమూడు రోజుల్లోగా పంపిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment