
సవదత్తి పచ్చ గాజులు భళా.!
సాక్షి, బళ్లారి: మహిళలకు అందులోనూ ముత్తైదు మహిళలకు గాజులు అంటే ఎంతో భక్తి, ఇష్టంతో వేసుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. తమ అలంకరణలో భాగంగా ప్రతి మహిళ రంగు రంగుల గాజులు వేసుకుని వారు ధరించిన చీరకు తగ్గట్టుగా మ్యాచింగ్ గాజులు వేసుకుని మురిసిపోతుంటారు. కూలీ పనులు చేసుకుని జీవించే మహిళ నుంచి అపర కుబేరుల కుటుంబాలకు చెందిన మహిళలకు అందరి చేతుల్లో గాజుల సవ్వడి ఉంటే వారి ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి గాజులు ముఖ్యంగా సవదత్తి యల్లమ్మ ఆలయం వద్ద ధరిస్తే మహిళలకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందని, ముత్తైదువుగా ఉంటామని నమ్మకంతో మహిళలు సవదత్తికి వచ్చి గాజులు వేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
రంగు రంగుల గాజుల విక్రయాలు
బెళగావి జిల్లా సవదత్తి యల్లమ్మ గుడ్డలో వెలసిన రేణుక యల్లమ్మ దేవస్థానం ఆలయ పరిసరాల్లో వైవిధ్యమయమైన రంగు రంగుల గాజుల విక్రయాలు విశేషంగా కనిపిస్తాయి. గతంలో గాజుల కట్ట అని పిలుచుకునే స్థలం ప్రస్తుతం గాజులపేటగా వర్ధిల్లుతోంది. వందలాది కుటుంబాలు దశాబ్దాలుగా గాజులు విక్రయమే జీవనాధార పరంపరను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో స్థలం తగినంత లేకపోవడంతో గుడ్డ పరిసరాల్లో ఎటు చూసినా గాజుల గలగలలు మహిళల సందడితో అలరారుతోంది. పౌర్ణమి, మంగళ, శుక్రవారాల్లో అన్ని అంగళ్లలో విద్యుత్ వెలుగు జిలుగులతో దేదీప్యమానంగా అలంకరణలతో కనిపిస్తాయి. గాజులను ఒక కుప్పగా అందంగా పేర్చడమే ఇక్కడ పెద్ద ముచ్చటగా చెప్పుకుంటారు. ఆలయ పశ్చిమ, ఉత్తర దిక్కుల్లో వ్యాపారులు ఏడాదంతా గాజులు విక్రయిస్తారు. మిగిలిన వారు జాతర వేళలో మాత్రమే వచ్చి వ్యాపారాలు చేసుకుని తిరిగి వెళ్లిపోతారు.
గాజులు ఎక్కడ నుంచి వస్తాయంటే..
ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ నగరంలో ఓ ఫ్యాక్టరీలో తయారు చేసిన ఈ గాజులు సవదత్తి యల్లమ్మ ఆలయ పరిసరాల్లో సందడి చేస్తాయి. అక్కడ నుంచి సవదత్తి, బైలహొంగల, బాగలకోటె జిల్లా జమఖండికి వచ్చే గాజులను వ్యాపారుల నుంచి యల్లమ్మ గుడ్డ వ్యాపారులు కొనుగోలు చేస్తారు. 80 శాతానికి పైగా పచ్చ గాజులనే ఇక్కడ విక్రయిస్తారు. ఇక్కడ పచ్చ గాజులకే భారీ డిమాండ్. ప్రతి మంగళ, శుక్రవారాలు, పౌర్ణమి, నవరాత్రులు శుభ ఘడియల్లో అత్యధికంగా గాజుల విక్రయం జరుగుతాయని యల్లమ్మ ఆలయ ముఖ్యులు తెలిపారు.
కొంగు బంగారంగా రేణుకా యల్లమ్మ
గాజుల సవ్వడిలో మురుస్తున్న భక్తులు

సవదత్తి పచ్చ గాజులు భళా.!