ఇందిరా డెయిరీలో మౌలిక వసతులు
● డిసెంబర్ నాటికి 250 యూనిట్ల గ్రౌండింగ్ ● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం సహకారనగర్: మధిర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటుచేస్తున్న ఇందిరా మహిళా డెయిరీలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన డెయిరీ నిర్వహణ, పాల సేకరణ కేంద్రాలు, కొత్త యూనిట్ల ఏర్పాటు, మహిళా సంఘాల గ్రేడింగ్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా ఏయే గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలో నిర్ధారించాలని తెలిపారు. పాల ఉత్పత్తిలో ఉన్న కుటుంబాలను గుర్తించి మండలానికి 50చొప్పున యూనిట్లను డిసెంబర్ నాటికి గ్రౌండింగ్ చేయాలని సూచించారు. తక్కువ పశువులు ఉన్న కుటుంబాలకు రెండు చొప్పున గేదెలు పంపిణీ చేయాలన్నారు. కాగా, మహిళా శక్తి కార్యక్రమ అమలుకు మహిళా సంఘాల సమావేశాలు తప్పనిసరిగా జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. ఈ విషయమై ముదిగొండ, వైరా, రఘునాథపాలెం తదితర మండలాలలో గ్రేడింగ్ పెరగగా, మధిర, చింతకాని మండలాల్లో యూనిట్ గ్రౌండింగ్ పురోగతి బాగుందని తెలిపారు. ఇక ఐకేపీ ద్వారా సన్న రకం ధాన్యం కొనుగోళ్లపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, డీఆర్డీవో సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు.
డెయిరీ స్థల పరిశీలన
ముదిగొండ: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఇందిరా డెయిరీ భవన నిర్మాణానికి స్థలాన్ని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ బుధవారం పరిశీలించారు. గత మూడు నెలలుగా వాయిదా వేస్తున్న అధికారులను మందలించిన ఆయన ప్రధాన రహదారికి దగ్గరలో పాత భవనాన్ని తొలగించి నూతన నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఆతర్వాత కులగణన సర్వేపై సూచనలు చేసిన కలెక్టర్, శిథిలావస్థలో ఉన్న శాఖ గ్రంథాలయాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. డీఆర్‌డీఓ ఆర్.సన్యాసయ్య, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ శ్రీధర్‌స్వామి పాల్గొన్నారు.
లక్ష్య సాధనకు కృషి చేయాలి
ఖమ్మంరూరల్: విద్యార్థి దశలోనే లక్ష్యాలను ఎంచుకుని వాటిని చేరుకునేలా నిరంతరం శ్రమించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మం రూరల్ మండలంలోని జలగంగనర్‌లోని ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఆయన ఆరో తరగతి విద్యార్థులకు గణితం పాఠాలు బోధించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని డైరీలో రాసుకుని ప్రతిరోజు దాన్ని చేరేందుకు ఎంత కష్టపడ్డామో గుర్తు చేసుకోవాలన్నారు. చదువుతో పాటు ఆటల్లోనూ ముందుండాలని సూచించారు. ఆతర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా రూ.8లక్షలతో చేపట్టిన పనులను పరిశీలించి విద్యుత్ సంబంధిత పనుల కోసం రూ.50వేలు చెక్కును హెచ్‌ఎం శ్యాంసన్‌కు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment