సమగ్ర సర్వే ప్రారంభం
● తొలి రోజు 70.08శాతం ఇళ్ల గుర్తింపు ● నేటితో గుర్తింపు పూర్తి.. రేపటి నుంచి సర్వే మొదలు
ఖమ్మం సహకారనగర్: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఇళ్ల గుర్తింపు ప్రక్రియ బుధవారం మొదలైంది. బోనకల్, ఖమ్మం రూరల్, ముదిగొండ మండలాలతో పాటు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పరిశీలించారు. ఇళ్ల గుర్తింపు గురువారం పూర్త్తికానుండగా, శుక్రవారం నుంచి వివరాల సేకరణ మొదలుపెడతారు. కాగా, జిల్లాలోని 5,36,335 గృహాలకు గాను తొలిరోజు 3,75,873ఇళ్ల(70.08శాతం)ను గుర్తించారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 2,02,941, గ్రామీణ ప్రాంతాల్లో 3,33,394 గృహాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
ప్రణాళికల రూపకల్పనకే సర్వే
ఖమ్మంమయూరిసెంటర్: ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రణాళికల రూపకల్పన చేసేందుకే ఇంటింటి సర్వే చేపడుతోందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఖమ్మం 53వ డివిజన్ ద్వారకానగర్‌లో చేపట్టిన ఎన్యూమరేషన్ బ్లాక్‌ల గుర్తింపును బుధవారం ఆయన పరిశీలించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతీ 150 ఇళ్లకు ఒక ఎన్యూమరేషన్ బ్లాక్ చొప్పున 3,300 బ్లాక్‌లను గుర్తించామని, ఇళ్ల లెక్క తేలాక అదనపు బ్లాక్‌లు కేటాయిస్తామని తెలిపారు. ఇదేసమయంలో స్టిక్కర్ వేయని ఇళ్ల విషయమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమగ్ర సర్వేతో ప్రస్తుతం అందుతున్నవి, భవిష్యత్‌లో అమలయ్యే పథకాలు కానీ ఆగిపోతాయనే అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. ఇందులో భాగంగా స్వచ్ఛందంగా చెప్పే వారి నుంచే వివరాలు తీసుకుంటారు తప్ప బలవంతం చేయబోరని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ తెలిపారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, అసిస్టెంట్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, కార్మిక శాఖ సహాయ కమిషనర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment