మనిషికి రోజుకు 100లీటర్లు...
● వేసవిలో నీటి సరఫరాకు ప్రణాళిక ● రేపటి నుంచి గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్
ఖమ్మంవన్‌టౌన్: రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి ఎదురుకాకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు మిషన్ భగీరథ అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో గ్రామాల్లో సమస్యలు గుర్తించి పరిష్కరించనున్నారు. ఇందుకోసం శనివారం నుంచి ఫిబ్రవరి 10 తేదీ వరకు జిల్లా, డివిజన్, మండల పంచాయతీ అధికారులు, గ్రామ కార్యదర్శులు, సీఈ మొదలు ఏఈఈల వరకు గ్రామాల బాట పట్టనున్నారు. గత వేసవిలో సమస్య ఎదురైన గ్రామాల్లోనే కాక అన్నిచోట్ల నీటి పంపులు, పైపులను తనిఖీ చేస్తారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించి వచ్చే ఐదు నెలల పాటు నీటి సరఫరా సాగేలా ప్రణాళిక రూపొందించనున్నారు.
ప్రత్యేక కమిటీలు
తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న అవాంతరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా గ్రామ, మండల స్ధాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలకు తోడు అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను గుర్తిస్తారు. వీటిని పరిష్కరించడం ద్వారా నీటి సరఫరా ఇక్కట్లను అధిగమించనుండగా, మిషన్ భగీరఽథ నీటిపై నమ్మకం కలిగించేలా అవగాహన సదస్సులు సైతం నిర్వహిస్తారు. వేసవిలో ప్రతీ మనిషికి 100 లీటర్ల నీరు సరఫరా లక్ష్యంగా నిర్దేశించుకోవాలన్న మంత్రి సీతక్క ఆదేశాలతో మిషన్ భగీరథ అధికారులు కార్యాచరణ రూపొందించుకున్నారు.
ఇబ్బందులు రాకుండా ప్రణాళిక
జిల్లావ్యాప్తంగా రానున్న వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం. గతంలో మాదిరి సమస్యలు రాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరిస్తాం. ఇందుకోసం శనివారం నుంచి 10వ తేదీ వరకు పరిశీలన చేపట్టనున్నాం.
– పుష్పలత, మిషన్ భగీరఽథ ఈఈ, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment