రహదారుల విస్తరణకు సిద్ధం
ఖమ్మంఅర్బన్: జిల్లా వ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ రోడ్లు విస్తరణ, వరదల ప్రభావంతో దెబ్బతిన్న రహదారుల మరమ్మతుకు అధికారులు రూ.వెయ్యి కోట్లతో అంచనాలు రూపొందించారు. ప్రధాన గ్రామాలను కలిపే లింక్ రోడ్లలో రద్దీ ఎక్కువగా ఉన్న వాటిని గుర్తించగా, సింగిల్ రోడ్లను రెండు వరుసలుగా, రెండు వరుసల రోడ్లను నాలుగు వరుసగా విస్తరించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయగా, త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనున్నారు. వీటికి తోడు గత ఏడాది వరదలతో దెబ్బతిన్న రహదారులు, బ్రిడ్జిల మరమ్మతు పనులను కూడా ప్రతిపాదనల్లో పొందుపరిచారు.
అత్యధికంగా పాలేరులో...
వరదల ప్రభావంతో అత్యధికంగా పాలేరు నియోజకవర్గంలో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. దీంతో 45 పనులకు రూ.300 కోట్లకు పైగా అవసరమని అంచనాలు రూపొందించినట్లు తెలిసింది. ఖమ్మం నియోజకవర్గంలో ఏడు పనులకు రూ.150 కోట్లు అవసరమని గుర్తించారు. ఇందులో ప్రధానంగా ఖమ్మం–వైరా ప్రధాన రహదారి ఎస్‌ఆర్ గార్డెన్స్ నుండి రఘునాథపాలెం బైపాస్ వరకు ఉన్న రెండు లేన్ల రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలనే ప్రతిపాదన ఉంది. ఈ రహదారిలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మించనుండడంతో భవిష్యత్‌లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా విస్తరించనున్నారు. అలాగే, రఘునాథపాలెం వద్ద జింకల తండా రోడ్డు సైతం ప్రస్తుతం రెండు వరుసలతో ఉండగా నాలుగు లేన్లుగా విస్తరిస్తారు.
ఇవికాక వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలోనూ పలు రహదారుల విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా దశల వారీగా నిధులు మంజూరైతే పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
విస్తరణకు తోడు దెబ్బతిన్న
రోడ్ల మరమ్మతుకు రూ.వెయ్యి కోట్లు
ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment