● ఎన్నికలకు 27మంది నోడల్ ఆఫీసర్లు ● జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాల ఖరారు
ఖమ్మంసహకారనగర్: వరంగల్–ఖమ్మం– నల్ల గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లలో వేగం పెరిగింది. ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీ కాలం వచ్చేనెల 29తో ముగియనుంది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ మొదలవడంతో ఈనెల 27న జరిగే పోలింగ్‌కు అధికారులు సిద్ధమవుతున్నారు. గతనెల 31న ఓటరు జాబితా విడుదల చేయగా మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వీటి పరిశీలన అనంతరం ఈనెల 7న ఓటర్ల తుది జాబితా ఖరారవుతుంది.
21మండలాలు.. 24 కేంద్రాలు
జిల్లాలోని 21మండలాల పరిధిలో ఎన్నికల నిర్వహణకు 24పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. కేంద్రాలను ఎనిమిది సెక్టార్లుగా విభజించి ప్రతీ సెక్టార్‌కు అధికారులను నియమించారు. అలాగే ఉద్యోగుల నియామకం కూడా పూర్తయింది. ఎంపిక చేసిన 21 మంది నోడల్ ఆఫీసర్లకు అధికారులు మాధవి, రాజేశ్వరి మాస్టర్ ట్రెయినీలుగా శిక్షణ ఇస్తున్నారు. అనంతరం నోడల్ ఆఫీసర్లు మిగతా సిబ్బందికి శిక్షణ ఇస్తారు. కాగా, పోలింగ్ అధికారులు(పీఓలు)గా 28 మంది వ్యవసాయాధికారులు, ఏపీఓలుగా 27 మంది డీటీలు, ఓపీఓలుగా సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, గిర్దావర్లు 52 మందిని నియమించారు. అంతేకాక ముందస్తుగా మరికొందరిని రిజర్వ్‌గా ఎంపిక చేశారు. ఎన్నికల ఏర్పాట్లను అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, డీఆర్‌ఓ పద్మశ్రీ పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల సామగ్రి భద్రపరిచేందుకు ట్రెజరీ కార్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటుచేయగా, ఖమ్మం కలెక్టరేట్‌లోనే ఉద్యోగులకు సామగ్రి పంపిణీ, స్వీకరణ ఉంటుంది.
ఉపాధ్యాయుల్లో సందడి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యాన ఉపాధ్యాయ సంఘాల్లో హడావుడి నెలకొంది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ మొదలుకాగా, ఈనెల 27న పోలింగ్ నిర్వహిస్తారు. దీంతో ఉపాధ్యాయులు ఎక్కడ కలిసినా ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఈసారి ఎవరెవరు బరిలో ఉన్నారు, గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన అభ్యర్థి ఏమేం చేశారు, ఈసారి ఎవరికి ఓటు వేయాలి, తమ సంఘం మద్దతు ఎవరికి ఉందనే అంశంపై చర్చిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment